Espionage case : అమెరికా విదేశాంగ విధానంలో కీలక పాత్ర పోషించే అత్యంత గౌరవనీయమైన వ్యక్తి, భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త, అమెరికా రహస్యాలను తన బద్ధ శత్రువైన చైనాకు చేరవేశారంటే నమ్మగలమా…? వాషింగ్టన్ అధికార వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తూ, ప్రముఖ విదేశాంగ సలహాదారు ఆష్లే జె. టెల్లీస్‌ను అమెరికా ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరీ ఆష్లే టెల్లీస్…? ఆయనపై మోపబడిన నిర్దిష్ట ఆరోపణలేంటి…? ఈ గూఢచర్యం కథ ఎలా బయటపడింది…?
అమెరికా విదేశాంగ, రక్షణ విధాన రూపకల్పనలో దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యూహకర్త ఆష్లే జె. టెల్లీస్ (64) అరెస్టు అమెరికాలో కలకలం సృష్టిస్తోంది. అత్యంత రహస్యమైన జాతీయ భద్రతా సమాచారాన్ని చట్టవిరుద్ధంగా తన వద్ద ఉంచుకోవడమే కాకుండా, చైనా ప్రభుత్వ అధికారులతో రహస్యంగా సమావేశమయ్యారన్న తీవ్రమైన ఆరోపణలపై వర్జీనియాలో ఫెడరల్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) వర్జీనియాలోని టెల్లీస్ నివాసంలో వారాంతంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో, వివిధ ప్రాంతాల్లో దాచి ఉంచిన వెయ్యి పేజీలకు పైగా వర్గీకృత పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని “అత్యంత రహస్యం (Top Secret)”గా గుర్తించబడినవి కూడా ఉన్నాయని కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో టెల్లీస్, రక్షణ, విదేశాంగ శాఖల భవనాల్లోని కంప్యూటర్ల నుంచి అమెరికా సైనిక విమానాల సామర్థ్యానికి సంబంధించిన రహస్య పత్రాలను ప్రింట్ తీసుకున్నట్లు నిఘా వీడియోల ద్వారా గుర్తించారు. అనంతరం ఆ పత్రాలను తన బ్రీఫ్‌కేస్‌లో పెట్టుకుని బయటకు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.
టెల్లీస్ ఇటీవలి సంవత్సరాలలో చైనా ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సమావేశమైనట్లు కూడా FBI తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఒక సందర్భంలో, వాషింగ్టన్ శివారులోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన విందుకు టెల్లీస్ ఒక మనీలా ఫోల్డర్‌తో ప్రవేశించగా, చైనా అధికారులు బహుమతి సంచితో లోపలికి వెళ్లారని, అయితే టెల్లీస్ తిరిగి వచ్చేటప్పుడు ఆ ఫోల్డర్ అతని వద్ద కనిపించలేదని FBI పేర్కొంది. అయితే, ఈ సమావేశాల్లో ఆయన వర్గీకృత సమాచారాన్ని అందించినట్లు మాత్రం అఫిడవిట్‌లో నేరుగా ఆరోపించలేదు.
ఎవరీ ఆష్లే టెల్లీస్ : ముంబయిలో జన్మించిన ఆష్లే టెల్లీస్, అమెరికా పౌరసత్వం స్వీకరించి వాషింగ్టన్‌లోని అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన ప్రస్తుతం కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే ప్రముఖ థింక్ ట్యాంక్‌లో టాటా ఛైర్ ఫర్ స్ట్రాటజిక్ అఫైర్స్ హోదాలో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. గతంలో జార్జ్ డబ్ల్యూ. బుష్ హయాంలో జాతీయ భద్రతా మండలిలో ప్రత్యేక సహాయకుడిగా పనిచేయడమే కాకుండా, అమెరికా-భారత్ చారిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై చర్చలు జరిపిన కీలక బృందంలో సభ్యుడిగా ఉన్నారు. రిపబ్లికన్, డెమొక్రాటిక్ ప్రభుత్వాల హయాంలో ఆయన సలహాదారుగా వ్యవహరించారు.
ఈ అరెస్టుతో వాషింగ్టన్‌లోని విదేశాంగ విధాన నిపుణుల వర్గాలు తీవ్ర ఆందోళనకు లోనయ్యాయి. టెల్లీస్‌పై మోపబడిన అభియోగాలు రుజువైతే, అతనికి పదేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.


