India Denies Trump’s Claim of Phone Call with PM Modi: అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తనతో ఫోన్‌లో మాట్లాడారని, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు త్వరలోనే నిలిపివేస్తామని హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం వాటిని తీవ్రంగా ఖండించింది. అసలు ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య అలాంటి ఫోన్ సంభాషణ ఏదీ జరగలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తేల్చి చెప్పింది.
ALSO READ: Trump On Modi: రష్యా నుంచి క్రూడ్ ఆయిన్ ఇండియా కొనదని మోదీ మాటిచ్చారు: ట్రంప్
వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు. ఆయన ఒక గొప్ప వ్యక్తి. మేమిద్దరం ఇటీవల మాట్లాడుకున్నాం. రష్యా నుంచి చమురు కొనబోమని ఆయన నాకు హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ వెంటనే పూర్తి కాకపోవచ్చు, కానీ త్వరలోనే ముగుస్తుంది,” అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపివేస్తే, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడం మరింత సులభం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మలేషియాలో జరగబోయే ఆసియాన్ సదస్సులో మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెంటనే స్పందించారు. “అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఇటీవల ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదు. ఇంధన సమస్యపై అమెరికా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మేం ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశాం,” అని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: US Espionage Case: అమెరికాకు సలహాదారు.. చైనాకు గూఢచారి? భారత సంతతి వ్యక్తి అరెస్టుతో సంచలనం!
జాతి ప్రయోజనాలే ప్రాధాన్యం..
భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తమ ఇంధన విధానాన్ని మరోసారి పునరుద్ఘాటించింది. “భారత్ పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. అస్థిరంగా ఉన్న అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా జాతీయ ప్రయోజనాలకే అనుగుణంగా ఉంటాయి తప్ప, ఏ ఇతర రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదు,” అని ఆ ప్రకటనలో పేర్కొంది. స్థిరమైన ధరలు, నిరంతర సరఫరా అనే రెండు స్తంభాలపై తమ ఇంధన భద్రత ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వివాదంపై రష్యా కూడా స్పందించింది. “భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు చాలా ముఖ్యం. భారత ప్రభుత్వ విధానం వారి జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని మేము అర్థం చేసుకున్నాం. భారత్‌తో చమురు, గ్యాస్ సహకారంపై చర్చలు కొనసాగిస్తాం,” అని మాస్కో ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు, ఈ విషయంపై దేశీయ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, “ప్రధాని మోదీ ట్రంప్‌కు భయపడుతున్నారు,” అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు. అయితే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, ఆ పార్టీకి సరైన నాయకత్వం, దిశానిర్దేశం లేదని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు పదేపదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తమ దేశ ప్రజలకు ఏది మంచిదో అదే చేస్తామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పలు సందర్భాల్లో గట్టిగా చెప్పిన విషయం తెలిసిందే.
ALSO READ: Trump on BRICS: బ్రిక్స్ అంటే డాలర్‌పై దాడి – నా సుంకాల దెబ్బకే కూటమి విచ్ఛిన్నం: ట్రంప్


