Zelenskyy India visit: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ త్వరలో భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఆయన పర్యటనకు సంబంధించిన తేదీలను ఖరారు చేసేందుకు ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ తెలిపారు. గత సంవత్సరం ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీవ్ పర్యటనలో జెలెన్స్కీని భారత్‌కు ఆహ్వానించారు. ఈ పర్యటన జరగడం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఒక గొప్ప విజయమని పోలిష్‌చుక్ పేర్కొన్నారు. జెలెన్స్కీ పర్యటన ద్వారా భారతదేశం నుంచి మరింత ఆర్థిక, దౌత్య మద్దతు లభిస్తుందని ఉక్రెయిన్ భావిస్తోంది.
భారత మధ్యవర్తిత్వం
జెలెన్స్కీ పర్యటనకు ముందే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది చివరి నాటికి భారత్‌కు రానున్నారు. ఇటీవల రష్యా పర్యటనలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఒకే సంవత్సరంలో ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులు ఇద్దరూ భారత్‌ను సందర్శించడం ఒక అరుదైన, కీలకమైన దౌత్య పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ అనుసరిస్తున్న తటస్థ వైఖరి, శాంతి స్థాపనకు చేస్తున్న కృషి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రపంచానికి శాంతి సందేశం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ శాంతి పక్షాన నిలిచింది. ప్రధాని మోదీ “ఇది యుద్ధ యుగం కాదు” అని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఆయన పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితోనూ అనేకసార్లు ఫోన్‌లో మాట్లాడి, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ పర్యటనలు భారత్‌ను ఒక శక్తివంతమైన మధ్యవర్తిగా ప్రపంచానికి చూపిస్తున్నాయి. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలు కూడా భారత్ చొరవను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ పర్యటనల వల్ల భారత్ దౌత్యపరంగా మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరుదేశాల అధ్యక్షుల పర్యటనలతో ప్రపంచ శాంతి స్థాపనలో భారత్ తన పాత్రను మరింత పెంచుకునే అవకాశం ఉంది.


