INDIA MALDIVES RELATIONS : భారత్-మాల్దీవుల మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తోందా? గతంలో ఉన్న ఉద్రిక్తతలు సద్దుమణిగి, రెండు దేశాలు తిరిగి స్నేహపూర్వకంగా ముందుకు సాగుతున్నాయా? అవుననే సమాధానమే బలంగా వినిపిస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీని తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
భారత్-మాల్దీవ్ సంబంధాల్లో కొత్త ఊపిరి : భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు తిరిగి బలపడుతున్నాయని స్పష్టమవుతోంది. గతంలో చైనాకు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా ముయిజ్జు ప్రభుత్వం వ్యవహరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే, 2024 అక్టోబరులో ప్రధాని మోదీతో ముయిజ్జు సమావేశమైన తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయి. ప్రస్తుతం, భారత సాయంతో మాల్దీవుల్లో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ ప్రాజెక్టులను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు మాల్దీవుల ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రాజీ మార్గం సుగమం : హిందూ మహాసముద్రంలో మాల్దీవులు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశం. భారత్ ఎప్పటినుంచో మాల్దీవులను వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. గతంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన విమర్శలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. అయితే, 2024లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవ్ పర్యటన, ఆ తర్వాత ముయిజ్జు-మోదీ సమావేశం ఇరు దేశాల మధ్య రాజీ మార్గాన్ని సుగమం చేశాయని చెప్పొచ్చు.
మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి: ప్రస్తుతం, భారత ఆర్థిక సాయంతో హనీమాదో అంతర్జాతీయ విమానాశ్రయం , తిలామేల్ వంతెన నిర్మాణం మాల్దీవుల్లో వేగంగా సాగుతోంది.
హనీమాదో అంతర్జాతీయ విమానాశ్రయం: ఈ విమానాశ్రయం రన్‌వే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. టెర్మినల్ 83%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ 96% పనులు పూర్తయ్యాయని మాల్దీవుల గృహనిర్మాణ మంత్రి అబ్దుల్లా ఎక్స్‌లో తెలిపారు. ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చిన 136 మిలియన్ డాలర్ల రుణంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు సెప్టెంబరు 2025 నాటికి పూర్తి కానుంది. ఇది హాదాలు అతోల్ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది.
తిలామేల్ వంతెన పురోగతి: తిలామేల్ వంతెన పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికి 60% పనులు పూర్తయ్యాయి. అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఈ వంతెనను నిర్మిస్తోంది. మొత్తం 263 పైల్స్ (వంతెన కింద ఉండే స్తంభాలు)లో 68 పైల్స్‌ను సముద్రంపై నిర్మించారు. ఈ వంతెన నిర్మాణానికి భారత ప్రభుత్వం 100 మిలియన్ డాలర్లు గ్రాంటుగా, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ 400 మిలియన్ డాలర్లు రుణంగా అందిస్తున్నాయి. ఈ వంతెన మాల్‌ను ఇతర ద్వీపాలతో అనుసంధానించి, మాల్దీవులలో రవాణాను సులభతరం చేస్తుంది. ఇది ఆ దేశానికి జీవనాడిగా మారనుంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానం: జూలై 26న మాల్దీవ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ముయిజ్జు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు భారత్-మాల్దీవ్ సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయని, ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నారు. ఇది కేవలం దౌత్యపరమైన మలుపు మాత్రమే కాదు, ఇరు దేశాల ప్రజల మధ్య బంధాన్ని కూడా బలపరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
India-Maldives Relations :మాల్దీవుల ప్రాజెక్టులకు భారత్ తోడు.. మెరుగుపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలు!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES