India On Gaza Ceasefire: అంతర్జాతీయ వేదికపై భారత్… గాజాలో మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అడపాదడపా కాల్పుల విరమణలు కంటితుడుపు చర్యలేనని స్పష్టం చేసింది.గాజాలో మిగిలింది కేవలం మరుభూమి. ఆహారం, నీరు, వైద్యం అందక ప్రజలు అల్లాడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ భయానక పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా భారత్ తన గళాన్ని గట్టిగా వినిపించింది. తాత్కాలిక విరామాలు అక్కడి ప్రజల కష్టాలను తీర్చలేవని, శాశ్వత కాల్పుల విరమణ ఒక్కటే మార్గమని తేల్చిచెప్పింది.
గాజా సంఘర్షణపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఉన్నత స్థాయి చర్చలో, భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మన దేశపు స్పష్టమైన వైఖరిని ప్రపంచ దేశాల ముందుంచారు.
ALSO READ: https://teluguprabha.net/international-news/india-uk-trade-deal-signed-landmark-fta/
‘శాంతికి ప్రత్యామ్నాయం లేదు’:
“గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్రమైన ఆహారం, ఇంధనం, వైద్య సేవల కొరతతో అలమటిస్తున్నారు. ఈ మానవతా సవాళ్లను పరిష్కరించడానికి శత్రుత్వాలకు అడపాదడపా ఇచ్చే విరామాలు ఏమాత్రం సరిపోవు,” అని హరీశ్ స్పష్టం చేశారు. శాంతికి ప్రత్యామ్నాయం లేదని, తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ జరగాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. బందీలుగా ఉన్నవారందరినీ బేషరతుగా విడుదల చేయాలని, చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ బలంగా విశ్వసిస్తోందని ఆయన తెలిపారు.
ALSO READ:https://teluguprabha.net/international-news/america-wrestling-legend-hulk-hogan-dies-at-71/
పాలస్తీనాకు అండగా భారత్:
“పాలస్తీనాతో భారత్‌కు చారిత్రక, బలమైన బంధం ఉంది. పాలస్తీనా ప్రజలకు మేము ఎల్లప్పుడూ అండగా నిలిచాం. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన మొదటి అరబ్-యేతర దేశం భారతే,” అని హరీశ్ గుర్తుచేశారు. గాజాలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం దాదాపు 95% ఆసుపత్రులు దెబ్బతిన్నాయని, 6,50,000 మందికి పైగా చిన్నారులు నెలల తరబడి పాఠశాల విద్యకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్ కార్యాచరణపై ఆశ:
జులై 28-30 తేదీలలో జరగనున్న ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేస్తుందని భారత్ ఆశిస్తోందని హరీశ్ అన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పే అన్ని ప్రయత్నాలకు భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
మరోవైపు, ఈ యుద్ధంలో ఇప్పటివరకు 59,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మానవతా సహాయ కేంద్రాలపై జరిగిన దాడుల్లోనే అనేక మంది మరణించడం ఈ సంక్షోభం యొక్క తీవ్రతకు అద్దం పడుతోంది.


