Wednesday, July 16, 2025
Homeఇంటర్నేషనల్India-Pak Prisoner Exchange: జైలు గోడల మధ్య ఆశల రెక్కలు!

India-Pak Prisoner Exchange: జైలు గోడల మధ్య ఆశల రెక్కలు!

INDIA PAK EXCHANGE PRISONERS LIST :  జైలు గోడల మధ్య చిక్కుకున్న వారి జీవితాలు, వారి కోసం వేచి చూసే కుటుంబాల ఆశలు… భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన తాజా ఖైదీల జాబితా మార్పిడి సరిహద్దులకు అతీతంగా మానవతా దృక్పథాన్ని చాటింది. ప్రతి సంవత్సరం జనవరి 1 మరియు జూలై 1న జరిగే ఈ జాబితా మార్పిడి, ఈసారి కూడా ఇరు దేశాల జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్యను స్పష్టం చేసింది. భారత జైళ్లలో 463 మంది పాకిస్థానీలు, పాక్ జైళ్లలో 246 మంది భారతీయులు ఉన్నట్లు ఈ జాబితాలు వెల్లడించాయి. అసలు ఈ జాబితా మార్పిడి ఎందుకు? శిక్ష పూర్తి చేసుకున్న వారు ఎప్పుడు ఇంటికి చేరుకుంటారు? ఈ ఒప్పందం ఖైదీల కుటుంబాలకు ఎలాంటి ఆశలు నింపుతుందో పూర్తి వివరాలు మీకోసం…

2008 ఒప్పందం: మానవతా పరిరక్షణకు ఒక వేదిక : భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య 2008లో కుదిరిన ఒక కీలక ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు ప్రతి ఏటా జనవరి 1 మరియు జూలై 1న తమ జైళ్లలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాలను మార్పిడి చేసుకుంటాయి. ఈ ఒప్పందం కేవలం ఒక నివేదిక మార్పిడి మాత్రమే కాదు, ఖైదీల భద్రత, ఆరోగ్య సంరక్షణ, సకాలంలో విడుదలతో పాటుగా వారి స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జూలై 1, 2025న జరిగిన ఈ ఒప్పందం కారణంగా పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం (FO) ఒక ప్రకటన విడుదల చేసింది.

భారత జైళ్లలో పాకిస్థానీ ఖైదీల చిట్టా : భారత్ తన జైళ్లలో బందీలుగా ఉన్న 463 మంది పాకిస్థానీల జాబితాను పాకిస్థాన్ హై కమిషన్‌కు అందజేసింది. ఈ జాబితాలో 382 మంది సాధారణ పౌరులు, 81 మంది మత్స్యకారులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, భారత విదేశాంగ శాఖ శిక్షాకాలం పూర్తి చేసుకున్న 159 మంది పాకిస్థానీ మత్స్యకారులతో పాటుగా, పౌరులను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని పాకిస్థాన్‌ను కోరింది. అదేవిధంగా, మరో 80 మంది పాకిస్థానీల జాతి ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ కోరింది. ఇది వారి విడుదల ప్రక్రియకు అత్యంత కీలకం.

పాక్ జైళ్లలో భారతీయుల నిరీక్షణ : పాకిస్థాన్ కూడా తన వంతుగా ఆ దేశ జైళ్లలో ఉన్న 246 మంది భారతీయుల జాబితాను భారత హై కమిషన్‌కు అందించింది. ఈ జాబితాలో 53 మంది సాధారణ పౌరులతో పాటుగా, 193 మంది మత్స్యకారులు ఉన్నట్లు పాక్ పేర్కొంది. భారత్ తరపున, శిక్ష పూర్తి చేసుకున్న 159 మంది భారతీయులను వెంటనే విడుదల చేసి తిరిగి పంపాలని పాకిస్థాన్‌ను కోరింది. అంతేకాకుండా, 26 మంది భారతీయులకు ఇప్పటికీ కాన్సులర్ యాక్సెస్ లభించలేదని, వారికి తక్షణమే ఈ సదుపాయం కల్పించాలని భారత్ నిర్దేశించింది. కాన్సులర్ యాక్సెస్ అనేది ఖైదీల క్షేమం తెలుసుకోవడానికి, న్యాయ సహాయం అందించడానికి అత్యవసరం.

- Advertisement -

మానవతా దృక్పథంతో కూడిన ఆకాంక్షలు: భారత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ 2014 నుంచి ఇప్పటివరకు 2,661 మంది మత్స్యకారులను, 71 మంది పౌరులను పాకిస్థాన్ నుంచి తిరిగి తీసుకోవడంలో గణనీయమైన విజయం సాధించింది. ఇందులో 2023 నుంచి 500 మంది మత్స్యకారులు, 13 మంది పౌరులు ఉన్నారు. పాకిస్థాన్ కూడా తమ ఖైదీల భద్రత, ఆరోగ్య రక్షణ విషయంలో శ్రద్ధ వహించాలని భారత్ నిరంతరం కోరుతోంది. ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని కేవలం రాజకీయ లావాదేవీగా కాకుండా, మానవతా సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రాధాన్య అంశంగా పరిగణిస్తున్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఆశగా ఎదురుచూపులు : ఈ జాబితా మార్పిడి వల్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీల కుటుంబాలకు తమవారు త్వరగా ఇంటికి వస్తారని ఎదురుచూస్తున్నారు. అయితే, జాతి ధ్రువీకరణ ప్రక్రియలో జాప్యం వల్ల ఆందోళన పెరుగుతోంది. రెండు దేశాలు మానవతా దృక్పథంతో వేగంగా వ్యవహరించి, అనవసర ఆలస్యం చేయకుండా ఖైదీలను వారి కుటుంబాలతో తిరిగి కలపాలని వేలాది మంది ప్రజలు ఆశిస్తున్నారు. 


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News