Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Philippines: భారత్-ఫిలిప్పీన్స్ బంధంతో.. డ్రాగన్‌కు బంధనం!

Philippines: భారత్-ఫిలిప్పీన్స్ బంధంతో.. డ్రాగన్‌కు బంధనం!

India-Philippines Strategic Partnership: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నడుమ, భారత్, ఫిలిప్పీన్స్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ పరిణామం ప్రాంతీయ స్థిరత్వం, భద్రతకు అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. రెండు దేశాల మధ్య రక్షణ, భద్రత, ఆర్థిక సహకారంలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.  ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ వచ్చే వారం భారత పర్యటనకు రానున్నారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టాక భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.  ఈ పర్యటన ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకల నడుమ జరగడం విశేషం. ఇంతకీ ఈ పర్యటన ప్రాధాన్యత ఏమిటి..? ఇరు దేశాల మధ్య కుదిరే ఒప్పందాలు ఇండో-పసిఫిక్‌లో చైనా ఆధిపత్యానికి ఏ విధంగా చెక్ పెట్టనున్నాయి..? ఈ బంధం ఇరు దేశాలకు ఎంతవరకు ప్రయోజనకరం..? అనే ప్రశ్నలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
 
చారిత్రక బంధానికి కొత్త ఊపు:

- Advertisement -

భారత్, ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాలు 1949 నవంబర్‌లో మొదలయ్యాయి. అప్పటి నుంచి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ టెక్నాలజీ వంటి అనేక రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.ముఖ్యంగా, ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్)తో భారత్ కు ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఫిలిప్పీన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ “యాక్ట్ ఈస్ట్” పాలసీ, ‘మహాసాగర్’ విజన్, ఇండో-పసిఫిక్ వ్యూహంలో ఫిలిప్పీన్స్‌తో సంబంధాలు ఒక ముఖ్యమైన స్తంభంగా విదేశాంగ శాఖ అభివర్ణించింది.

ALSO READ:https://teluguprabha.net/international-news/trump-pakistan-oil-deal-india-tariffs/

మార్కోస్ పర్యటన వివరాలు:

ఆగస్టు 4 నుంచి 8 వరకు ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో అధ్యక్షుడు మార్కోస్‌తో పాటు ఆయన సతీమణి లూయిస్ అరనేటా మార్కోస్, పలువురు క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధుల బృందం పాల్గొంటుంది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీతో మార్కోస్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో కూడా ఆయన సమావేశమవుతారు.న్యూఢిల్లీలో అధికారిక కార్యక్రమాల తర్వాత, మార్కోస్ బృందం బెంగళూరును కూడా సందర్శిస్తుంది.

రక్షణ, సముద్ర రంగాలపై ప్రధాన దృష్టి:

ఈ పర్యటనలో ప్రధానంగా రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో సహకారంపై దృష్టి సారించనున్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో ఫిలిప్పీన్స్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా భారత్ నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ శక్తి వంటి యుద్ధనౌకలు ఇటీవల ఫిలిప్పీన్స్‌లో పర్యటించి, ఆ దేశ నౌకాదళం నుంచి ఘన స్వాగతం అందుకున్నాయి.ఇది ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధానికి నిదర్శనం.

ALSO READ: https://teluguprabha.net/international-news/quad-nations-declare-strategy-to-counter-chinas-rare-earth-dominance/

పెరుగుతున్న వాణిజ్యం, పర్యాటకం:

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.53 బిలియన్ డాలర్లకు చేరింది.భారత్ నుంచి ఇంజనీరింగ్ వస్తువులు, ఆటో విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఉక్కు, ఔషధాలు, బియ్యం, మాంసం వంటివి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి అవుతుండగా, ఫిలిప్పీన్స్ నుంచి ఎలక్ట్రికల్ మెషినరీ, సెమీకండక్టర్లు, రాగి, సీసం, ప్లాస్టిక్స్ వంటివి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి.ఇటీవల ఫిలిప్పీన్స్ భారత పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించడంతో పర్యాటకుల సంఖ్య 28% పెరిగింది.

అధ్యక్షుడు మార్కోస్ పర్యటన భారత్-ఫిలిప్పీన్స్ సంబంధాలలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దోహదపడగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరే ఒప్పందాలు భవిష్యత్ సహకారానికి మార్గం సుగమం చేయనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad