ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మార్గదర్శకాలు అందించడమే కాక, ఆపన్నులను ఆదుకోవడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కొవిడ్ సమయంలో ఆ సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలను అందరూ స్వాగతించగా, కొన్నింటిపై మాత్రం విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా చైనా నుంచే వైరస్ వచ్చిందన్న విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించి, ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన డబ్ల్యూహెచ్ఓ చేష్టలుడిగిందని అనేక దేశాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు అలాంటి ముఖ్యమైన సంస్థ నుంచి అమెరికా వైదొలగింది.
చైనా కేంద్రగా ఉందన్న ఆరోపణలతో
ఇది అంతర్జాతీయ ఆరోగ్య పరిపాలన రంగంలోనే ఒక పెద్ద కుదుపు లాంటిది. డబ్ల్యూహెచ్ఓ ‘చైనా కేంద్రంగా’ ఉంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలాకాలంగా విమర్శిస్తున్నారు. దాంతో సంబంధాలను తెంచుకుంటానని బెదిరించారు కూడా. ఇటీవలే ఆ పని కాస్తా పూర్తయిపోయింది. కానీ చాలా కాలం నుంచి డబ్ల్యూహెచ్ఓకు ఆర్థికపరంగా అతిపెద్ద మద్దతు అమెరికా నుంచే అందుతోంది. దాంతో ఇప్పుడు ఆ దేశం వెళ్లిపోవడం వల్ల ఆర్థికపరంగాను, వ్యూహాత్మకంగానూ ఒక శూన్యత ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా ఆరోగ్య సహకారం విషయంలో భవిష్యత్తు గురించి ఇది ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది.
మనకు ఇదే మంచి ఛాన్స్
ఇదంతా భారతదేశానికి కొంతవరకు కలిసొచ్చే అవకాశంగానే భావించాలి. ఒకవైపు డబ్ల్యూహెచ్ఓ నుంచి నిధులు తగ్గిపోవడం వల్ల కొన్ని రకాల పథకాలకు డబ్బుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కానీ, అంతర్జాతీయ ఆరోగ్య వ్యూహాలను రూపొందించడం, వాటిని పక్కాగా అమలు చేయడం లాంటి విషయాల్లో నాయకత్వ స్థానాన్ని అందిపుచ్చుకోవడానికి భారత్‌కు ఇదే ఒక మంచి అవకాశం. మన దేశం ఇప్పటికే ఫార్మా రంగం, టీకాల అభివృద్ధి, తయారీలతో పాటు శరవేగంగా పెరుగుతున్న డిజిటల్ హెల్త్ వ్యవస్థతో ప్రపంచంలో ఇతర దేశాలన్నింటి కంటే ఆరోగ్యం విషయంలో మంచి పురోగతంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థలన్నింటిలో తన దౌత్యపరమైన ఉనికిని కూడా చాటుకుంటోంది. ఇలాంటి తరుణంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలగడం వల్ల ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడం ఒక్క భారత్‌కు మాత్రమే సాధ్యం. ఆ సంస్థ నుంచి అందే నిధుల మీద ఆధారపడే ఇప్పటివరకు కొన్ని కార్యక్రమాలను మన దేశం కూడా నిర్వహిస్తోంది. ఆ నిధులు ఆగిపోవడం అంటే తప్పనిసరిగా కొంత ఇబ్బందే అవుతుంది. కానీ, దాన్ని అధిగమించడం మరీ అసాధ్యం అయితే కాదు. ఇలాంటి అవకాశాలు మళ్లీమళ్లీ రమ్మంటే రావు. ఏదో ఒక దేశం వచ్చి దాన్ని ఎగరేసుకుపోయే ముందే భారతదేశం స్పందించి, ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా వెళ్లిపోయిన ప్రభావమెంత?
అసలు ముందు డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా నిష్క్రమించడం వల్ల ఎలాంటి ప్రభావం కలుగుతుందో ముందు చూడాలి. కొంతకాలం పాటు సంస్థకు ఆర్థిక ఇబ్బందులైతే తప్పవు. అమెరికా స్థాయిలో నిధులు ఇవ్వగల దేశాలు ప్రస్తుతం ఏమీ లేనట్లే. సభ్యదేశాలన్నీ తప్పనిసరిగా ఎంతో కొంత ఈ సంస్థకు ఇవ్వాలి. అయితే, కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులకు మాత్రం కొన్ని దేశాలే నిధులిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందే మొత్తం నిధుల్లో సుమారు 15 శాతం ఒక్క అమెరికా నుంచే అందుతాయి. అది వెళ్లిపోతే ఆ మేర లోటు తప్పదు. ప్రపంచమంతా కూడా డబ్ల్యూహెచ్ఓ కావాలనే అనుకుంటే, దేశాలన్నీ ఎంతో కొంత ఆ సంస్థకు ఇవ్వడం కొనసాగిస్తాయి. ఈ విషయంలో నాయకత్వం వహించే అవకాశం తప్పనిసరిగా భారత్‌కు ఉంటుంది. అమెరికా ఆపేసిన నిధులను పూడ్చుకోవాలంటే అన్ని దేశాలూ తమ వాటాను కొంతమేర పెంచాలి. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణలో భారతదేశం కీలక పాత్ర పోషించేందుకు కావల్సినంత అవకాశం ఉంది. కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకూ టీకాలు అందించడం ద్వారా ఇప్పటికే తన శక్తి సామర్థ్యాలను భారత్ నిరూపించుకుంది. అంతర్జాతీయంగా ఎలాంటి సంక్షోభం వచ్చినా భారత్ సమర్థంగా ఎదుర్కోగలదన్న విషయం ప్రపంచానికీ తెలిసింది. అదే సమయంలో, పోలియో నిర్మూలన లాంటి కొన్ని కార్యక్రమాలకు డబ్ల్యూహెచ్ఓపైనే భారత్ ఆధారపడింది.
సమర్థంగా ఉపయోగించుకుంటే
డబ్ల్యూహెచ్ఓను మరింత బలోపేతం చేయడానికి భారత్ ఈ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాల్లా భారత్ ఎక్కువగా వాణిజ్య ప్రయోజనాలు చూసుకోదని, విస్తృత ప్రజా ప్రయోజనాలపైనే దృష్టి పెడుతుందని అంటున్నారు. అలాంటప్పుడు పేద దేశాలకూ ఆరోగ్య కార్యక్రమాలు, ముఖ్యంగా టీకాలు అందాలంటే భారత్ లాంటి దేశం ముందుకు రావాలని వాదిస్తున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ఉండే జనరిక్ మందుల ఉత్పత్తిలోనూ మన దేశం సామర్థ్యాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలతో అద్భుతాలు సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతున్న భారతదేశ ఆరోగ్యరంగ బడ్జెట్‌ను మరికొంత పెంచి ప్రపంచ ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ముందుకు రావాలని పలువురు అంతర్జాతీయ నిపుణులు కోరుతున్నారు. ఈసారి భారత్ తన బడ్జెట్‌లో ఏకంగా రూ.95,967 కోట్లను ఆరోగ్య రంగానికి కేటాయించింది. ఇంతకు ముందు సంవత్సరం కంటే ఇది 9.46% ఎక్కువ. అలాగే 2010తో పోలిస్తే 2025 నాటికి పొగాకు వాడకం 30% తగ్గిస్తే టీబీ, క్యాన్సర్ లాంటి కొన్ని వ్యాధులు బాగా తగ్గుతాయని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి చొరవలనే ప్రపంచవ్యాప్తంగా కూడా అమలు చేస్తే ప్రపంచం మొత్తం అనేక రకాల వ్యాధుల బారి నుంచి బయటపడుతుంది. అందుకు భారత నాయకత్వమే సరైనది.
(తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి)