India Reopens Tourist Visas to China: భారత్-చైనా ఇరు దేశాల నడుమ సంబంధాలను పునరుద్ధరించాలనే దిశలో, ఐదు సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం చైనా పౌరులకు టూరిస్ట్ వీసాల జారీ ప్రక్రియను పునః ప్రారంభించనుంది. జూలై 24 నుండి చైనా పౌరులకు పర్యాటక వీసాలు జారీ చేయడాన్ని భారతదేశం తిరిగి ప్రారంభిస్తుందని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా 2020లో భారతదేశం అన్ని పర్యాటక వీసాలను నిలిపివేసింది. 2020 ప్రారంభంలో కరోనా వైరస్ ప్రభావంతో చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న 22,000 మంది భారత విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ తరువాత, వారిని చైనా ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు తిరిగి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు.
ఈ విషయంలో 2022లో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ద్వారా ఓ సర్క్యులర్ విడుదల చేస్తూ, చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని సస్పెండ్ చేసింది. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ప్రయాణాలు, సాంస్కృతిక మార్పిడి, వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి.
గత అక్టోబర్‌లో, తూర్పు లడఖ్‌లోని చివరి రెండు ఘర్షణ కేంద్రాలు అయిన డెప్సాంగ్, డెమ్‌చోక్ కోసం ఇరుపక్షాలు విడిపోయే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తో చర్చలు జరిపి సంబంధాలను మెరుగుపరచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
Readmore: https://teluguprabha.net/news/will-crush-your-economy-warns-us-senator-to-india-china/
ఈ సంవత్సరం ప్రారంభంలో.. భారతదేశం, చైనా సంబంధాలను పునర్నిర్మించడానికి మార్గాలను అన్వేషించాయి. లద్దాఖ్ సరిహద్దులో ఇద్దరు దేశాల బలగాలు వెనక్కి తీసుకోవడం, కైలాస మానససరోవర్ యాత్రను మళ్లీ ప్రారంభించే అంశాలపై రెండు దేశాలు కొన్ని కీలక ఒప్పందాలకు వచ్చాయి. అలాగే నేరుగా విమాన సర్వీస్ లను తిరిగి ప్రారంభించాలని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ఇరు దేశాలు సంబంధాలు మెరుగు పరుచుకోవడం కోసం సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయని అన్నారు.


