Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్India-UK Trade Deal: యూకేతో భారత్... అన్నదాతకు ఆర్థిక అండ!

India-UK Trade Deal: యూకేతో భారత్… అన్నదాతకు ఆర్థిక అండ!

India UK agricultural trade benefits : భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ జులై 24న ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో పంజాబ్ గోధుమ పొలాల నుంచి కేరళ సుగంధ ద్రవ్యాల క్షేత్రాల వరకు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారుల నుంచి అసోం తేయాకు తోటల వరకు యావత్ భారత రైతు లోకానికి మహర్దశ పట్టనుంది. అసలు ఈ ఒప్పందం మన రైతుల జీవితాలను ఎలా మార్చబోతోంది..? ఏపీ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు దక్కే ప్రత్యేక ప్రయోజనాలేంటి..?

- Advertisement -

మే 6, 2025న తుది రూపు సంతరించుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ప్రస్తుతం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ డీల్ ప్రకారం, ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి అడ్డుగోడలుగా ఉన్న పన్నుల భారం తొలగిపోనుంది. ముఖ్యంగా, భారత వ్యవసాయ రంగంపై ఈ ఒప్పందం చూపే ప్రభావం అపారమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పన్నుల్లేని పండుగ – మన ఉత్పత్తులకు రెడ్ కార్పెట్ : ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం, భారత వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల ఎత్తివేత. 95% ఉత్పత్తులపై సున్నా సుంకం: భారత దేశానికి చెందిన దాదాపు 95 శాతానికి పైగా వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై యూకే ఇకపై ఎలాంటి పన్ను విధించదు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పచ్చళ్లు, మామిడి గుజ్జు, మసాలా దినుసులు వంటివన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.

గిట్టుబాటు ధర గ్యారెంటీ: పన్నుల విషయంలో మనపై ఎటువంటి భారం లేకపోవడం వల్ల, భారతదేశ రైతులు, ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మార్కెట్‌లో ఇతర దేశాల ఉత్పత్తులతో సమానంగా, పోటీపడే ధరలకు విక్రయించగలరు. ఇది మన రైతుల ఆదాయాన్ని నేరుగా పెంచుతుంది.

సేంద్రియానికి భలే గిరాకీ: రసాయనాలు లేకుండా పండించిన పనస, మిల్లెట్లు, పసుపు, అల్లం, మిరియాలు వంటి సేంద్రీయ ఉత్పత్తులకు యూకేలో భారీ డిమాండ్ ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మన రైతులకు లాభాల పంట పండినట్లే.

రైతన్నల రక్షణ కవచం – వ్యూహాత్మక మినహాయింపులు : రైతుల ప్రయోజనాలే పరమావధిగా భారత ప్రభుత్వం ఈ ఒప్పందంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దేశీయ రైతులను, ఆహార భద్రతను కాపాడేందుకు కొన్ని కీలక ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి మినహాయించింది. డైరీ ఉత్పత్తులు, యాపిల్స్, ఓట్స్, వంట నూనెలు వంటి వాటిపై పన్నుల విధానం యథాతథంగా కొనసాగుతుంది. దీనివల్ల విదేశీ ఉత్పత్తుల వెల్లువతో దేశీయ రైతులు నష్టపోకుండా రక్షణ లభిస్తుంది.

ఆంధ్రా, కేరళ తీరాలకు అపార అవకాశాలు : ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలలోని ఫిషరీస్ రంగానికి ఒక వరం లాంటిది.

రొయ్యలు, ట్యూనాపై సుంకం రద్దు: ఇప్పటివరకు భారత్ నుంచి దిగుమతి చేసుకునే రొయ్యలు, ట్యూనా చేపలపై యూకే 4.2% నుంచి 8.5% వరకు సుంకం విధించేది. ఇకపై ఆ పన్ను ఉండదు.

పెద్ద మార్కెట్‌లో పెద్ద వాటా: యూకే ఏటా 5.4 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇందులో మన వాటా కేవలం 2.25%. పన్నులు లేకపోవడంతో ఈ పెద్ద మార్కెట్‌లో మన వాటాను గణనీయంగా పెంచుకునే సువర్ణావకాశం లభించింది.

కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలకు కొత్త వెలుగు : భారత టీ ఎగుమతుల్లో యూకే వాటా 5.6% కాగా, సుగంధ ద్రవ్యాలలో 2.9%గా ఉంది. ఇకపై ఈ ఉత్పత్తులపై పన్నులు లేకపోవడంతో, కర్ణాటక, కేరళ, అసోం రైతులు యూకే మార్కెట్‌లో మరింతగా రాణించే అవకాశం ఉంది. అదే విధంగా సోయాబీన్, పల్లీలు, నువ్వుల వంటి నూనె గింజల ఎగుమతులకు కూడా ద్వారాలు తెరుచుకున్నాయి.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad