India’s flood warning to Pakistan : శత్రువైనాసరే, ఆపదలో ఆదుకోవడమే మానవత్వం. ద్వైపాక్షిక సంబంధాలు ఎంతగా దెబ్బతిన్నా, ఒప్పందాలు నిలిచిపోయినా, ప్రకృతి వైపరీత్యాల ముందు మానవ ప్రాణాలకే పెద్దపీట వేయాలనే ఉన్నతమైన విలువలను భారత్ మరోసారి చాటిచెప్పింది. ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాల కారణంగా సట్లెజ్ నదికి పెను వరద ముప్పు పొంచి ఉందని, పొరుగు దేశమైన పాకిస్థాన్‌ను ముందుగానే అప్రమత్తం చేసింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూనే, మానవతా దృక్పథంతో భారత్ వ్యవహరించిన తీరు వెనుక ఉన్న ఆంతర్యమేంటి..? ఈ హెచ్చరిక పాకిస్థాన్‌కు ఎంతవరకు ఉపయోగపడనుంది..?
ఉత్తరాదిలో వరుణుడి బీభత్సం: గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
నిండుతున్న జలాశయాలు: ఈ భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులపై ఉన్న ప్రధాన డ్యామ్‌లు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి.
నీటి విడుదల: డ్యామ్‌ల భద్రత దృష్ట్యా, అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పాక్‌కు పొంచి ఉన్న ముప్పు: ఈ అదనపు నీటి ప్రవాహం వల్ల, దిగువన ఉన్న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సట్లెజ్ నది ఉప్పొంగి, తీవ్రమైన వరదలు సంభవించే ప్రమాదం ఉందని భారత అధికారులు అంచనా వేశారు. పాకిస్థాన్‌లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో, భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌లోని అధికారులకు ఈ సమాచారాన్ని అధికారికంగా చేరవేశారు.
ఒప్పందాలు పక్కనపెట్టి.. మానవత్వానికే పెద్దపీట: నిజానికి, 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం, వరదల సమాచారాన్ని రెండు దేశాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. అయితే, పహల్గామ్‌లో జరిగిన కిరాతక ఉగ్రదాడి తర్వాత, పాకిస్థాన్‌తో ఈ డేటా మార్పిడిని భారత్ నిలిపివేసింది. అయినప్పటికీ, కేవలం మానవతా దృక్పథంతోనే, ఎలాంటి లాంఛనాలకు తావులేకుండా ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు భారత అధికారులు స్పష్టం చేశారు. గత వారం కూడా, జమ్మూలోని తావి నదికి సంబంధించి మూడుసార్లు పాకిస్థాన్‌ను అప్రమత్తం చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు.
భారత్ చేసిన ఈ ముందస్తు హెచ్చరికతో, పాకిస్థాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది.


