HomeTop StoriesUS Midterm Elections: మధ్యంతర ఎన్నికల్లో ఇండో-అమెరికన్ల సత్తా

US Midterm Elections: మధ్యంతర ఎన్నికల్లో ఇండో-అమెరికన్ల సత్తా

వాషింగ్టన్‌, నవంబర్‌ 4: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్లు గణనీయమైన విజయాలు సాధించారు. ఇప్పటివరకు ఐదుగురు భారతీయ-అమెరికన్లు ప్రతినిధుల సభకు ఎన్నిక కాగా, మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అరుణా మిల్లర్‌ మరోసారి అదే పదవికి ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రెస్‌, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన మరికొందరు భారతీయ-అమెరికన్‌ అభ్యర్థుల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

- Advertisement -

అమీ బెరా

కాలిఫోర్నియాలోని మూడో కాంగ్రెస్‌ నియోజకవర్గం నుంచి డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన 61 ఏళ్ల అమీ బెరా మరోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. రిపబ్లికన్‌ అభ్యర్థి రాబ్‌ టక్కర్‌ను ఓడించి ఎనిమిదోసారి కాంగ్రెస్‌లో అడుగుపెట్టనున్నారు. వైద్యుడిగా కెరీర్‌ ప్రారంభించిన అమీ బెరా అసలు పేరు అమెరిష్‌ బాబులాల్‌ బెరా. 2012లో తొలిసారి ఎన్నికై, 2013 జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు. లాస్‌ ఏంజెలెస్‌లో గుజరాతీ వలసదారుల కుటుంబంలో జన్మించిన బెరా.. కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఇర్విన్‌ నుంచి జీవశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు వైద్య పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు 1999 నుంచి 2004 వరకు శాక్రమెంటో కౌంటీకి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, డేవిస్‌ వైద్య కళాశాలలోనూ విద్యా సంబంధిత బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీలో తూర్పు ఆసియా, పసిఫిక్‌ ఉపకమిటీకి ర్యాంకింగ్‌ సభ్యుడిగా ఉన్నారు. హౌస్‌ పర్మనెంట్‌ సెలెక్ట్‌ కమిటీ ఆన్‌ ఇంటెలిజెన్స్‌లోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ, భారత్‌-అమెరికా సంబంధాలు, విదేశాంగ విధానాలకు సంబంధించిన అంశాలపై ఆయన పనిచేశారు.

సుహాస్‌ సుబ్రహ్మణ్యం

వర్జీనియాలోని పదో కాంగ్రెస్‌ నియోజకవర్గం నుంచి డెమొక్రాటిక్‌ అభ్యర్థి సుహాస్‌ సుబ్రహ్మణ్యం రెండోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డేవ్‌ బెక్‌విత్‌పై విజయం సాధించారు. 40 ఏళ్ల సుహాస్‌ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జన్మించారు. న్యాయవాది, వ్యాపారవేత్త అయిన ఆయన టెక్నాలజీ స్టార్టప్‌లతో పనిచేయడంతో పాటు సొంత వ్యాపారాన్ని కూడా స్థాపించారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పాలనలో వైట్‌హౌస్‌లో సాంకేతిక విధానాల సలహాదారుగా పనిచేశారు. అనంతరం 2019 నుంచి 2023 వరకు వర్జీనియా హౌస్‌ ఆఫ్‌ డెలిగేట్స్‌లో, 2023 నుంచి 2024 వరకు రాష్ట్ర సెనేట్‌లో సభ్యుడిగా ఉన్నారు. టులేన్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ, నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ ప్రిట్జ్‌కర్‌ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి న్యాయ పట్టా పొందారు. వర్జీనియాలోని లౌడౌన్‌ కౌంటీలో భార్య మిరాండా పెనా సుబ్రహ్మణ్యం, ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నారు. తన ప్రాంతంలో స్వచ్ఛంద అగ్నిమాపక సిబ్బందిగా, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడిగా కూడా సేవలందించారు.

రో ఖన్నా

కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమొక్రాటిక్‌ నేత రో ఖన్నా మరోసారి విజయం సాధించారు. సిలికాన్‌ వ్యాలీలోని కీలక ప్రాంతాలను ఈ నియోజకవర్గం కలిగి ఉంది. 50 ఏళ్ల ఖన్నా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో భారతీయ వలసదారుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కెమికల్‌ ఇంజినీర్‌గా పనిచేయగా, తల్లి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సహాయక ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. ఖన్నా ప్రచార వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం.. ఆయన తాత అమర్‌నాథ్‌ విద్యాలంకర్‌ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, బ్రిటిష్‌ వలస పాలనను వ్యతిరేకించినందుకు నాలుగేళ్లు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రోగ్రెసివ్‌ కాకస్‌కు వైస్‌ చైర్మన్‌గా ఉన్న ఖన్నా, 2020లో బెర్నీ శాండర్స్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సహాధ్యక్షుడిగా వ్యవహరించారు. లైంగిక నేరాలకు పాల్పడినందుకు దోషిగా తేలిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పత్రాలను విడుదల చేయాలని రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు థామస్‌ మాసీతో కలిసి ఆయన ప్రయత్నించారు. భార్య రితుతో కలిసి ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు.

ప్రమీలా జయపాల్‌

వాషింగ్టన్‌ రాష్ట్రంలోని ఏడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమొక్రాటిక్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ తిరిగి ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో సియాటిల్‌తో పాటు పరిసర ప్రాంతాలు ఉన్నాయి. 1965లో చెన్నైలో జన్మించిన ఆమె 16 ఏళ్ల వయసులో జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో చదువుకునేందుకు అమెరికాకు వెళ్లారు. అనంతరం నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు అంతర్జాతీయ ప్రజారోగ్యం, అభివృద్ధి రంగాల్లో పనిచేశారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలో వలసదారుల హక్కుల కోసం పనిచేసే ‘వన్‌అమెరికా’ సంస్థను స్థాపించారు. 2016లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి దక్షిణాసియా సంతతి మహిళగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్‌ ప్రోగ్రెసివ్‌ కాకస్‌కు గతంలో చైర్‌పర్సన్‌గా, ప్రస్తుతం చైర్‌ ఎమెరిటాగా వ్యవహరిస్తున్నారు. ప్రతినిధుల సభ న్యాయ, విదేశీ వ్యవహారాలు, బడ్జెట్‌ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. వలస విధానం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక అసమానతలపై ఆమె చురుకుగా గళమెత్తుతున్నారు.

పియా దండియా

ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమొక్రాటిక్‌ అభ్యర్థి పియా దండియా విజయం సాధించారు. రిపబ్లికన్‌ అభ్యర్థి కేసీ ఆస్కర్‌ను ఓడించారు. భారతదేశం నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు పామ్‌ బీచ్‌ కౌంటీలో జన్మించి అక్కడే పెరిగారు. ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ ప్రారంభించిన పియా.. అనంతరం న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. వైట్‌హౌస్‌ ఫెలోగా సేవలందించడంతో పాటు టెక్నాలజీ సంస్థ యాపిల్‌లోనూ పనిచేశారు. తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్య, ఆర్థిక పురోగతికి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఒక ఉన్నత పాఠశాలను స్థాపించినట్లు ఆమె ప్రచార వెబ్‌సైట్‌ పేర్కొంది. వచ్చే ఏడాది జనవరిలో కొత్త ప్రతినిధుల సభ సమావేశమైనప్పుడు ఆమె భారతీయ-అమెరికన్‌ సభ్యుల్లో ఒకరిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

అరుణా మిల్లర్‌

ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన 61 ఏళ్ల అరుణా మిల్లర్‌ మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా మరోసారి ఎన్నికయ్యారు. గవర్నర్‌ వెస్‌ మూర్‌తో కలిసి ఆమె రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. రాజకీయాల్లోకి రాకముందు మాంట్‌గోమరీ కౌంటీ రవాణా శాఖలో 25 ఏళ్లపాటు సివిల్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. రహదారి భద్రత, ప్రజా రవాణా సౌకర్యాల మెరుగుదలపై ప్రధానంగా దృష్టి సారించారు. 2010 నుంచి 2018 వరకు మేరీల్యాండ్‌ హౌస్‌ ఆఫ్‌ డెలిగేట్స్‌లో 15వ జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పనిచేసిన రెండో మహిళగా, ఆ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్త పదవికి ఎన్నికైన తొలి వర్ణవివక్ష బాధిత వర్గానికి చెందిన మహిళగా, తొలి వలసదారుగా ఆమె గుర్తింపు పొందారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News