Strait of Hormuz: అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గం హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అలాగే భారత్‌కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
మూడు నౌకలపై దాడి
ఇరాన్ మొదటి నుంచి జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్ గుండా వెళ్తున్న కంటైనర్ షిప్‌లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. మొత్తం మూడు నౌకలపై ఇరాన్ దాడులు జరిపినట్టు అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
ఇందులో భారత నౌక కూడా ఉంది. దుబాయ్‌లోని జెబెల్ అలీ (Jebel Ali) పోర్టు నుంచి ముడిచమురుతో గుజరాత్ వైపు వస్తున్న ఈ నౌకను అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటుతున్న సమయంలో IRGC నావికా దళాలు అడ్డుకున్నాయి. సముద్ర నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపిస్తూ నౌకను ఇరాన్ తమ నియంత్రణలోకి తీసుకుని తీరానికి తరలించినట్లు సమాచారం. ప్రపంచ ముడిచమురు రవాణాలో 30 శాతానికి పైగా వాటా ఉన్న హర్మూజ్ జలసంధిలో ఇరాన్ పట్టు బిగించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే కొన్ని నౌకలపై కాల్పులు జరిగిన నేపథ్యంలో తాజా దిగ్బంధం భారత నౌకాయాన రంగంలో ఆందోళన కలిగిస్తోంది.
కేంద్రం స్పందన
నౌకలోని భారతీయ సిబ్బంది భద్రతపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఇరాన్ దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. గుజరాత్‌లోని కీలక పోర్టులకు చేరాల్సిన ఈ చమురు నౌక నిలిచిపోవడంతో దేశీయంగా ఇంధన నిల్వలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. కాగా ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్‌లో తమ బ్లాకేడ్(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
Also Read: TGSRTC Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఉద్యోగులకు MD నాగిరెడ్డి విజ్ఞప్తి

