Indian Man Stripped, Assaulted in Ireland: ఐర్లాండ్‌లో ఓ భారతీయ వ్యక్తిని కొట్టి, దుస్తులు తొలగించి, జాతి వివక్షతో (Racism) దూషించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణమైన దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతివివక్షపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.
సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి భారతీయ యువకుడిని తీవ్రంగా కొడుతూ, అతని దుస్తులను బలవంతంగా తొలగిస్తూ కనిపించాడు. బాధితుడిని జాతివివక్షతో దూషించినట్లు కూడా వీడియోలో స్పష్టంగా వినిపించింది.
ఖండించిన భారత్..
ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఐర్లాండ్‌లో ఒక భారతీయ పౌరుడిపై జరిగిన జాతివివక్ష దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని ఐర్లాండ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారికి తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఐర్లాండ్‌లోని భారతీయ సమాజం భద్రతకు కట్టుబడి ఉన్నాం” అని పేర్కొంది.
ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు జరగలేదని స్థానిక మీడియా నివేదించింది. ఐర్లాండ్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ..
ఈ సంఘటన ఐర్లాండ్‌లో నివసిస్తున్న భారతీయ సముదాయంలో ఆందోళనను రేకెత్తించింది. జాతివివక్ష, ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఐర్లాండ్‌లో భారతీయులపై దాడులు జరిగిన సంఘటనలున్నాయి. ఈ తాజా దాడి ఐర్లాండ్‌లో వలసదారుల భద్రత, జాతివివక్షపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.


