ఉద్యోగాల కోసం అమెరికా తదితర సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలకు సక్రమంగా వెళ్లే వారి సంఖ్యతో అక్రమంగా వెళ్లే వారి సంఖ్య పోటీ పడుతోంది. అమెరికాకు అక్రమంగా వలస వెడుతున్న భారతీయుల సంఖ్య ఆయేటికాయేడు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. నిజానికి ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం వలసపోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. నియమ నిబంధనలతో పాటు ఎన్నో ఆంక్షలు, పరిమితులు కూడా ఉంటాయి. అయితే, స్వదేశాల్లో ఉపాధి అవకాశాలు సరిగ్గా లేనందువల్ల ఇతర దేశాలకు ఏదో విధంగా వలసపోవడమన్నది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలకు ఓర్చి వర్ధమాన దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు వలసపోవడం అన్నది సర్వసాధారణ విషయమైపోయింది. భారతదేశం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల ఫ్రాన్స్ దేశానికి భారతదేశం నుంచి అక్రమంగా వలసపోయిన 303 మంది ప్రయాణికులను విమానాశ్రయంలోనే నిర్బంధించడం ఇందుకు తాజా ఉదాహరణ. ఇందులో 20 మంది ఫ్రాన్స్ లో ఆశ్రయం కోరగా. మిగిలిన వారంతా ముంబై వచ్చేయడం జరిగింది. అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అందించిన సమాచారం ప్రకారం, 2022 అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సుమారు లక్ష మంది భారతీయులు అమెరికాకు అక్రమంగా వలస వెళ్లడం జరిగింది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే అయిదు రెట్లు ఎక్కువ.
సాధారణంగా ఈ వలసలలో ఎక్కువ భాగం భద్రతా చర్యలు పటిష్టంగా ఉన్న మెక్సికో సరిహద్దుల ద్వారానే జరుగుతుంటాయి. భద్రత అంతంత మాత్రంగా ఉన్న కెనడా సరిహద్దుల ద్వారా మిగిలిన వలసలు జరుగుతుంటాయి. కాగా, 2019 జూన్ లో పంజాబ్ కు చెందిన ఒక ఆరేళ్ల పాప ఆరిజోనా ఎడారిలో నిర్జీవంగా పడి ఉండగా పోలీసులు గమనించి, దర్యాప్తు జరిపినప్పుడు, భారతీయులు వేల సంఖ్యలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలో ప్రవేశిస్తున్నట్టు వెల్లడైంది. ఇది కోవిడ్ రావడానికి తొమ్మిది నెలలకు ముందు జరిగిన విషయం. అప్పట్లో అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మెక్సికో సరిహద్దుల్లో కఠినమైన ఆంక్షలు విధించారు. ఎవరు వలస వచ్చినా, శరణార్థులుగా వచ్చినా వారిని నిర్మొహమాటంగా, వారు చెప్పేది కూడా వినకుండా వెంటనే వెనక్కి పంపించేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ ముగిసిన తర్వాత, జో బైడెన్ ప్రభుత్వం ఏతర్పడిన తర్వాత నుంచి మళ్లీ వలసలు పెరగడం ప్రారంభం అయింది. ఈ విధంగా వలసలు పెరగడాన్ని బట్టి, వేలాది మంది భారతీయులు ఇక గత్యంతరం లేకనో, దళారుల తప్పుదోవ పట్టించినందువల్లనో మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలో ప్రవేశిస్తున్నట్టు అర్థమవుతోంది.
ఈ ప్రయాణికులు చెబుతున్న కథలను, అనుభవాలను బట్టి వారి స్వరాష్ట్రాల్లో సాధారణ ప్రజలు పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ప్రజలు ఈ విధంగా వలసలు వెడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో చాలామంది కుటుంబాలతో సహా వెడుతున్నట్టు కూడా తెలిసింది. ఇందులో కొంత మంది మత కారణాలు చెబుతున్నప్పటికీ, అత్యధిక సంఖ్యాకులు వ్యవసాయ రంగంలోని కష్టనష్టాల కారణంగానే తాము ఇతర దేశాలకు వలస వెడుతున్నట్టు చెప్పడం జరుగుతోంది. దళారులు ఇక్కడి ప్రజల స్థితిగతులను అవకాశంగా తీసుకుని మాయమాటలు చెప్పి వారిని విదేశాలకు పంపడం కూడా జరుగుతోంది. ఎక్కువగా అమెరికా జీవనశైలి గురించి ఉన్నవీ లేనివీ చెప్పి వారిని విమానాలు ఎక్కించడం జరుగుతోంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఈ రకమైన అక్రమ మానవ రవాణా జరుగుతోందని తెలిసింది. వ్యవసాయ రంగం వారికి లాభదాయకంగా లేకపోవడం, నష్టాలు భరించవలసి రావడం వంటి కారణాల వల్ల వారు ఇతర దేశాలకు ఏదో విధంగా వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు. వీరిని విదేశాలకు అభూతకల్పనలతో పంపించే దళారులను ఎంత త్వరగా నిరోధిస్తే అంత మంచిది.