Indonesia Fire Accident: ఇండొనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఏడంతస్తుల కార్యాలయం భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనేక మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
సెంట్రల్ జకార్తాలో మంగళవారం మధ్యాహ్నం ఏడు అంతస్తుల కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తులో బ్యాటరీ పేలడంతో మధ్యాహ్నం మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. మంటలు పై అంతస్తులకు వ్యాపించాయని దీంతో 20 మంది చనిపోయారని వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు చర్యలు చేపట్టారు. సహాయచర్యలను ముమ్మరం చేశారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, 15 మంది మహిళలు ఉన్నట్లు సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్ సుసాత్యో పూర్నోమో కాండ్రో తెలిపారు. మరణించిన వారిలో గర్భిణీ ఉన్నట్లు వివరించారు.
మృతుల్లో ఎక్కువ మంది కాలిన గాయాలతో బాధపడుతున్నట్లు కనిపించలేదని, ఊపిరాడక చనిపోయి ఉంటారని సుసాత్యో పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. భవనం లోపల చిక్కుకున్న మరింత మందిని గుర్తించడానికి అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారని వెల్లడించారు.
Polisi: 20 Orang Meninggal dalam Kebakaran Kantor di Kemayoran
Baca di: https://t.co/M9eQCj95f6 pic.twitter.com/gipldDYXPp
— Kompas.com (@kompascom) December 9, 2025

