Indonesia: ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్‌లో షరియా చట్టాల అమలు తీరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు మద్యం సేవించారనే ఆరోపణలపై ఒక పురుషుడు, స్త్రీకి అక్కడి అధికారులు అత్యంత కఠినమైన శిక్షను అమలు చేశారు. బహిరంగంగా వందలాది మంది చూస్తుండగా.. ఆ జంటకు ఏకంగా 140 కొరడా దెబ్బలు విధించారు. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో అమలు చేసిన అత్యంత కఠినమైన శిక్షల్లో ఇదొకటని చెప్పుకోవచ్చు.
వివాహేతర సంబంధానికి గానూ 100 దెబ్బలు, మద్యం సేవించినందుకు మరో 40 దెబ్బలను శిక్షగా విధించినట్లు వెల్లడైంది. బండా అకేలోని ఒక బహిరంగ పార్కులో ఈ శిక్షా కొనసాగింది. బెత్తంతో వీపుపై కొడుతుండగా ఆ నొప్పిని భరించలేక సదరు మహిళ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అదే సమయంలో మరో నలుగురికి కూడా వేర్వేరు నేరాలకు గానూ శిక్షలు అమలు చేశారు. విచిత్రమేమిటంటే.. శిక్ష పడిన వారిలో ఒక షరియా పోలీసు అధికారి కూడా ఉండటమే.
also read Eesha Rebba: త్రివిక్రమ్ నన్ను మోసం చేశారు.. మొత్తానికి బయటపెట్టేసిన ఈషా రెబ్బా
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో, షరియా చట్టాలను కఠినంగా అమలు చేసే ఏకైక ప్రావిన్స్ అకే మాత్రమే. 2001లో ఈ ప్రాంతానికి ప్రత్యేక స్వయంప్రతిపత్తి లభించిన తర్వాత.. జాతీయ చట్టాలతో పాటు ఇస్లామిక్ చట్టాలను అమలు చేసే అధికారం ఇక్కడ ఉంది. జూదం, మద్యం సేవించడం, వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం వంటి వాటిని ఇక్కడ తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. స్థానిక అధికారులు ఈ శిక్షలను సమర్థిస్తున్నప్పటికీ.. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మాత్రం ఇలాంటి ఘోటమైన శిక్షలు విధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.
2025లో కూడా ఇద్దరు వ్యక్తులకు ఇలాగే 76 కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు. స్వయంప్రతిపత్తి అధికారాల సాకుతో ఇలాంటి అమానవీయ శిక్షలను కొనసాగించడం సరికాదని హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. అయితే తమ మతపరమైన ఆచారాలు, చట్టాల ప్రకారం ఇవి సరైనవేనని అక్కడి పాలకులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆధునిక సమాజంలో ఇటువంటి కఠిన చట్టాల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో.

