టెహ్రాన్,(తెలుగుప్రభ): హార్ముజ్ జలసంధి తమదేనని, ఎప్పటికీ ఇరాన్ ఆధీనంలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘‘హార్ముజ్‌ను ఒక ట్వీట్‌తోనో, విమాన వాహక నౌకతోనో, ఆదేశంతోనో, ఎన్నికల ప్రసంగంతోనో స్వాధీనం చేసుకోలేరు’’ అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది వ్యాఖ్యానించారు. వాస్తవాన్ని అంగీకరించాలని, ఇరాన్‌పై ఇప్పటికే అమెరికా వ్యూహాత్మకంగా, భారీగా నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ విధించిన నౌకా దిగ్బంధాన్ని కొనసాగిస్తామని తెలిపారు.హార్ముజ్ జలసంధి ‘‘గతంలో ఇరాన్‌దే, ప్రస్తుతం ఇరాన్‌దే, భవిష్యత్తులోనూ ఇరాన్‌దే’’ అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ ఈ కీలక జలమార్గంపై ఆంక్షలు విధించిందని, దాన్ని ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూసివేయాలన్నది ఇరాన్ ఆదేశాల మేరకే జరుగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు న్యూయార్క్‌లోని ఓ పోలీస్ అకాడమీలో జరిగిన రాజకీయ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ను పూర్తిగా ఓడించిన తర్వాత ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యను ట్రంప్ సరదాగా చేశారని వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి తర్వాత వివరణ ఇచ్చినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
అబద్ధాలు, కల్పిత ప్రచారం: అయితే ఇరాన్ సైన్యం ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. హార్ముజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉందని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ ప్రతినిధి తెలిపారు. అమెరికా నౌకలు సాధారణంగా హార్ముజ్ గుండా వెళ్తున్నాయన్న వాదనలు ‘‘అబద్ధాలు, కల్పిత ప్రచారం’’ మాత్రమేనని ఆయన అన్నారు. ఇరాన్ సాయుధ బలగాల అనుమతి, పర్యవేక్షణ లేకుండా వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు సురక్షితంగా ఈ జలసంధి గుండా వెళ్లలేవని స్పష్టం చేశారు. అమెరికా చేస్తున్న ప్రచారమంతా అబద్ధాలని, నిఘా వైఫల్యాల కారణంగా అమెరికా మరోసారి తప్పుడు అంచనాలు వేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.

