Iraq Shopping Mall Fire Tragedy: ఇరాక్‌లో ఓ కొత్తగా తెరుచుకున్న షాపింగ్ మాల్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 61 మంది అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉండటం హృదయాలను ద్రవింపజేస్తోంది. కుట్ నగరంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? దీనికి కారణం ఎవరు..? అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా..? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇరాక్ లోని కుట్ నగరంలో వారం రోజుల క్రితమే ఓ ఐదంతస్థుల షాపింగ్ మాల్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఇందులో రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు కూడా ఉన్నాయి. బుధవారం రాత్రి ఒక్కసారిగా ఈ భవనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భవనం మొత్తానికి వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో చాలామంది ఊపిరాడక ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంలో చిక్కుకున్న 45 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.
గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు:
ఈ ఘోర ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మృతదేహాల్లో 14 కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని వాపోయారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, షాపింగ్ మాల్ యాజమాన్యంపై విచారణ చేపట్టారు. 48 గంటల్లో ప్రాథమిక దర్యాప్తు నివేదికను వెల్లడిస్తామని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రధాని దిగ్భ్రాంతి, మూడు రోజుల సంతాపం:
ఈ ఘటనపై ఇరాక్ ప్రధానమంత్రి మహ్మద్ షియా అల్-సుడానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు ప్రావిన్స్ గవర్నర్ ప్రకటించారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇరాక్‌లో భవన నిర్మాణ సమయంలో భద్రతా లోపాల కారణంగా తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. 2021 జూలైలో నసిరియాలోని ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 92 మంది మరణించగా, 2023లో నినెవే ప్రావిన్స్‌లోని ఓ వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.


