ఇజ్రాయెల్ మరో సారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆగిఉన్న మూడు బస్సుల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాద దాడిగా అధికారులు భావిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుండి నలుగురు బందీల మృతదేహాలను తిరిగి ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఇవే కాకుండా మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు దొరికాయని, కానీ.. అవి పేలలేదని పోలీసు ప్రతినిధి ASI అహరోని తెలిపారు. ఐదు బాంబులు ఒకేలా ఉన్నాయని, వాటికి టైమర్లు అమర్చారని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. పేలని బాంబులను బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసారని అధికారులు తెలిపారు.
మరోవైపు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన చేసింది. దీనిపై ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అత్యవసర భద్రతా సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. ఈ బాంబు దాడులపై షిన్ బెట్ అంతర్గత భద్రతా సంస్థ దర్యాప్తును నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. మరోవైపు బాట్ యామ్ మేయర్ బ్రోట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
జనవరి 19 ఇజ్రాయెల్, పాలస్తీనా ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. దాని తరువాత నుంచి హమాస్ సంస్థ తమ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిచిపెడుతూ వస్తోంది. అయితే రీసెంట్ గా నలుగురు బందీల శవాలను ఇజ్రాయెల్ కు అప్పగించింది. దీంతో మిలిటెంట్ సంస్థ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది. బతికున్నవారిని అప్పగించాలని తాము కోరామని… అందుకు విరుద్ధంగా ఇజ్రాయీలను చంపేసి తమకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇది ఉగ్రవాద చర్య అని అనుమానాలు ఉన్నాయి.