Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Israel - Gaja: గాజాపై గర్జన.. నగరం స్వాధీనానికి నెతన్యాహు సై!

Israel – Gaja: గాజాపై గర్జన.. నగరం స్వాధీనానికి నెతన్యాహు సై!

Israel’s Gaza City takeover plan: దాదాపు రెండేళ్లుగా భీకర యుద్ధంతో రగులుతున్న గాజాలో, ఇజ్రాయెల్ తీసుకున్న తాజా నిర్ణయం పెను తుఫాను రేపుతోంది. హమాస్ ఉగ్రవాద సంస్థను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా, గాజా నగరాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునేందుకు ఆ దేశ భద్రతా వ్యవహారాల కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం ఒకవైపు హమాస్‌కు చావుదెబ్బ అని చెబుతున్నా, మరోవైపు బందీల ప్రాణాలకు ముప్పు అని, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌ను ఒంటరిని చేస్తుందని తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వెనుక నెతన్యాహు వ్యూహమేంటి..? బందీల భవిష్యత్తు ఏమిటి..? శిథిల నగరంలో ఇజ్రాయెల్ ఏం సాధించనుంది..? ఈ సంక్లిష్ట ప్రశ్నల నడుమ అసలేం జరుగుతోందో చూద్దాం.

- Advertisement -

హమాస్ సమూల నాశనమే లక్ష్యం: గాజా నగరాన్ని సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. “హమాస్‌ను అంతం చేయడమే మా అంతిమ లక్ష్యం. అందుకోసం గాజా నగరాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవడం తప్పనిసరి. ఆ తర్వాత పాలనా పగ్గాలను స్నేహపూర్వక అరబ్ దళాలకు అప్పగిస్తాం” అని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజా నగరంలోని మూడొంతుల భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఇప్పుడు మిగిలిన ప్రాంతాన్ని కూడా హస్తగతం చేసుకోవాలని నిర్ణయించాయి. అయితే ఈ నిర్ణయం, హమాస్ చెరలో మిగిలి ఉన్న సుమారు 20 మంది ఇజ్రాయెలీ బందీల ప్రాణాలను, లక్షలాది మంది పాలస్తీనియన్ల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది.

ALSO READS: https://teluguprabha.net/international-news/netanyahu-offers-advice-modi-trump/

బందీల బంధువుల ఆందోళన.. మాజీ అధికారుల హెచ్చరిక: గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ఇజ్రాయెల్ కేబినెట్ నిర్ణయం జెరూసలంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బందీల కుటుంబాలు ఆగ్రహంతో కేబినెట్ భవనం వద్ద ఆందోళన నిర్వహించాయి. ఈ నిర్ణయం తమ వారి ప్రాణాలకు ముప్పు తెస్తుందని వారు కన్నీటితో వేడుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రస్తుత మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్‌తో పాటు మాజీ భద్రతాధికారులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. గాజాను స్వాధీనం చేసుకోవడం వల్ల సైనిక ప్రయోజనం ఉండదని, ఇది బందీల ప్రాణాలకు, సైన్యంపై తీవ్ర ఒత్తిడికి కారణమవుతుందని వారు స్పష్టం చేశారు.

ALSO READ:https://teluguprabha.net/international-news/trump-putin-meeting-zelenskyy-precondition/

ఆక్రమించడానికి ఏమీ మిగల్లేదు: ఇజ్రాయెల్ ప్రకటనపై ఓ శరణార్థి శిబిరంలోని మైసా-అల్-హీలా అనే వ్యక్తి స్పందిస్తూ, “నిజానికి, వాళ్లు ఆక్రమించడానికి గాజాలో ఇప్పుడు ఏమీ మిగిలిలేదు” అని వ్యాఖ్యానించడం అక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. గురువారం ఒక్కరోజే దక్షిణ గాజాపై జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 42 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆసుపత్రులు నివేదించాయి. రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. నగరం దాదాపు పూర్తిగా శిథిలమైపోయింది.

ఒంటరి అవుతున్న ఇజ్రాయెల్: ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ వేదికలపై మరింత ఒంటరిని చేసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ నెతన్యాహు ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. “మా దేశ భద్రత కోసం, హమాస్‌ను పూర్తిగా నిర్మూలించి, గాజా ప్రజలకు విముక్తి కలిగించడం మా బాధ్యత. గాజాను మేం శాశ్వతంగా ఆక్రమించుకోము, కేవలం భద్రతను పటిష్టం చేసి, అరబ్ మిత్రులకు అప్పగిస్తాం” అని నెతన్యాహు తన చర్యను సమర్థించుకున్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు మరణించగా, 251 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. అనేక ఒప్పందాల తర్వాత కొందరు విడుదలైనా, ఇంకా 20 మంది ఇజ్రాయెలీ పౌరులు సహా 50 మంది హమాస్ చెరలోనే ఉన్నారని అంచనా. తాజా నిర్ణయం వారి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad