Israeli PM Netanyahu to visit India: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. అనంతరం పీఎం మోదీతో భేటీ కానున్నారు. ఈ పర్యటనతో భారత్, ఇజ్రాయిల్ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఇజ్రాయిల్ ప్రధాని పర్యటనపై ఖచ్చితమైన తేదీ ఖరారు కానప్పటికీ.. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. యుద్ధం ఆపాలని ట్రంప్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్-హమాస్ ఈ ఒప్పందానికి వచ్చాయి. ఓవైపు, అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని భారత్‌తో సంబంధాలు బలపేతం చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకోసమే ఆయన భారత్‌కు రానున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పర్యటన ద్వారా అమెరికాను కార్నర్ చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు ఛాన్స్..
నెతన్యాహు పర్యటన వల్ల ఇజ్రాయెల్-భారత్ మధ్య అంతరిక్ష పరిశోధనలు, రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, సాంకేతికత వంటి పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలోనే చాలా ఒప్పందాలు కొనసాగుతున్నాయి. నెతన్యాహు పర్యటనలో ఇవి మరింత బలోపేతం కానున్నాయి. నెతన్యాహు పర్యటన వల్ల భారత్‌కు కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో తమ ప్రాధాన్యతను చాటిచెప్పనుంది. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలపై తన వైఖరిని తెలియజేసింది. శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని పలు సూచనలు చేసింది. మరోవైపు అమెరికా విధించిన భారీ టారిఫ్‌లకు కూడా తలొగ్గలేదు. అంతేకాదు యుద్ధం ప్రభావం వల్ల నష్టపోయిన గాజా ప్రజలకు కూడా మానవతా సాయం చేస్తోంది. అలాగే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ ప్రపంచ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తోంది.
బీబీ’గా పిలిచే బెంజమిన్ నెతన్యాహు ఎవరంటే..
బెంజమిన్ నెతన్యాహు 1949లో టెల్ అవీవ్‌లో ఒక జియోనిస్ట్ కుటుంబంలో జన్మించారు. యూదు రాజ్యాధికారాన్నిఎంతో విలువైనదిగా భావిస్తారు. ఆయన తాత నాథన్ ఒక రబ్బీ(యూదు మత నాయకుడు). ఆయన అమెరికా, యూరప్‌లలో పర్యటించి జియోనిజానికి మద్దతు ఇచ్చేలా ప్రసంగాలు చేశారు. 1920లలో తన కుటుంబాన్ని పాలస్తీనాకు తరలించాడు. అక్కడ తన కుటుంబం పేరుని నెతన్యాహుగా మార్చాడు. అంటే దీని అర్థం “దేవుడు ఇచ్చినది”. ఇక ఆయన కుమారుడు, ప్రధాని నెతన్యాహు తండ్రి బెంజియన్ నెతన్యాహూ 1971 నుంచి 1975 వరకు కార్నెల్‌లో బోధించిన జుడాయిక్ అధ్యయనాల ప్రొఫెసర్. ఆయన 102 ఏళ్ల వయసులో మరణించాడు. దీన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూకి యూదు జాతి పట్ల ఎంతటి లోతైన సంబంధ ఉందో తెలిసిపోతుంది. అయితే, వీటన్నింటికీ అతీతంగా మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను నెతన్యాహు అమితంగా ఆకర్షింపబడటం మరింత విశేషం. పలు సందర్బాల్లో ఆయన భారతీయ వంటకాలను, భారతీయ సంస్కృతిని ప్రశంసలతో ముంచెత్తారు.


