Italy migrant boat capsizes : మంచి భవిష్యత్తు కోసం, కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి… ప్రాణాలను పణంగా పెట్టి కడలి దాటాలనుకున్నారు. సురక్షితమైన జీవితాన్ని వెతుక్కుంటూ ఐరోపా తీరానికి చేరాలన్నదే వారి ఆశ. కానీ, వారి ఆశల పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఆశలు ఆవిరయ్యాయి, కలలు కల్లలయ్యాయి. ఇటలీ సమీపంలోని లాంపెడుసా ద్వీపం వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో పదుల సంఖ్యలో వలసదారులు జలసమాధి అయ్యారు. అసలేం జరిగింది..? ఇంతమంది మృత్యువాత పడటానికి కారణాలేంటి..?
ఇటలీ దక్షిణ తీరంలోని లాంపెడుసా ద్వీపానికి సమీపంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. లిబియా నుంచి ఐరోపాకు బయలుదేరిన ఒక పడవ, మధ్యధరా సముద్రంలో అదుపుతప్పి బోల్తా పడింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ పడవలో సుమారు 92 నుంచి 97 మంది వలసదారులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇటాలియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టారు.
మృత్యుఘోష.. కొనసాగుతున్న గాలింపు : ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరో 12 మందికి పైగా గల్లంతయ్యారని, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, వారంతా ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం నుంచి సుమారు 60 మందిని సురక్షితంగా కాపాడి, లాంపెడుసా ద్వీపానికి తరలించారు. వారికి ప్రస్తుతం వైద్య సహాయం అందిస్తున్నారు.
నిత్యం పునరావృతమవుతున్న విషాదం : యుద్ధాలు, అంతర్యుద్ధాలు, పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి వేలాది మంది ప్రతి ఏటా ఇలా ప్రమాదకరమైన సముద్ర మార్గాల ద్వారా యూరప్‌కు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మానవ అక్రమ రవాణాదారులు, వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని, పాతబడిన, సామర్థ్యానికి మించిన సంఖ్యలో జనాలను పడవల్లో ఎక్కించి సముద్రంలోకి పంపుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ప్రమాదాలు జరిగి, మధ్యధరా సముద్రం వలసదారుల పాలిట మృత్యుకుహరంగా మారుతోంది. ఈ తాజా ఘటనపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ (UNHCR) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడాలని, సురక్షితమైన వలస మార్గాలను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.


