Jaish Terrorist’s Confession Exposes Pakistan: ఉగ్రవాదం విషయంలో ప్రపంచ దేశాల ముందు తాము బాధితులమని చెప్పుకునే పాకిస్థాన్, సొంత ఉగ్రవాది చేసిన వ్యాఖ్యలతో అడ్డంగా దొరికిపోయింది. జైషే మహ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరి, పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించాడు. పాకిస్థాన్ సరిహద్దులను కాపాడటానికే తాము ఉగ్రవాదాన్ని అక్కున చేర్చుకున్నామని బహిరంగంగా ఒప్పుకుని, ఉగ్రవాద సంస్థలకు, పాక్ సైన్యానికి మధ్య ఉన్న నిగూఢ సంబంధాలను బట్టబయలు చేశాడు.
ALSO READ: Shahid Afridi: రాహుల్ గాంధీని పొగిడిన పాక్ మాజీ క్రికెటర్.. బీజేపీ నేతల కౌంటర్ ఎటాక్!
గత వారం గది హబీబుల్లా పట్టణంలో జరిగిన ‘మిషన్ ముస్తఫా’ అనే వార్షిక సదస్సులో వేలాది మంది ముందు కశ్మీరి ప్రసంగించాడు. తుపాకులు ధరించిన గార్డుల మధ్య అతను చేసిన ప్రసంగం వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. “ఈ దేశ (పాకిస్థాన్) సరిహద్దులను కాపాడటం కోసం మేము ఉగ్రవాదాన్ని స్వీకరించి ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేసిన తర్వాత, మే 7న భారత బలగాలు బహవల్పూర్‌లో మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి,” అని కశ్మీరి ఉర్దూలో అంగీకరించాడు.
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు అజార్ కుటుంబం విలవిల
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్ ప్రధాన కేంద్రమైన బహవల్పూర్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్‌లోనే మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది హతమైనట్లు అప్పట్లో అజార్ స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడు కశ్మీరి వ్యాఖ్యలతో ఆ దాడుల తీవ్రత మరోసారి రుజువైంది.
ALSO READ: Israel Genocide in Gaza: గాజాలో ఇజ్రాయెల్‌ది నరమేధమే.. ఐరాస కమిషన్ సంచలన నివేదిక!
పాక్ ఆర్మీ చీఫ్‌ను ఇరికించిన ఉగ్రవాది
అంతటితో ఆగకుండా, మసూద్ ఇలియాస్ కశ్మీరి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను కూడా ఈ వివాదంలోకి లాగాడు. ‘ఆపరేషన్ సిందూర్’లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు సాక్షాత్తు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. “సీనియర్ జనరల్స్‌ను పంపారు” అని కశ్మీరి బహిరంగంగా ప్రకటించాడు. ఇది ఉగ్రవాదులకు పాక్ సైన్యం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి నిదర్శనం. గతంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సైతం, హతమైన ఉగ్రవాదుల దేహాలకు పాకిస్థాన్ జెండాలు కప్పి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని ఫోటోలతో సహా ఆరోపించిన విషయం తెలిసిందే. కశ్మీరి వ్యాఖ్యలు భారత వాదనకు బలం చేకూర్చాయి.
భారత్‌లో జరిగిన పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల సూత్రధారి అయిన మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినా, పాకిస్థాన్ అతనికి ఆశ్రయం కల్పిస్తూనే ఉంది. ఇప్పుడు కశ్మీరి ఒప్పుకోలుతో, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్థాన్ పాత్రపై ఎటువంటి సందేహాలకు తావు లేకుండా పోయింది. ఈ వీడియో ఆధారంగా పాకిస్థాన్‌ను మళ్లీ FATF గ్రే లిస్టులో చేర్చాలని భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఈ స్వయంకృతాపరాధం పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికపై మరింత ఇరుకున పెట్టడం ఖాయం.
ALSO READ: India US Trade Talks: భారత్-యూఎస్ వాణిజ్య చర్చలు పునఃప్రారంభం.. ట్రంప్ సలహాదారుని ఘాటు వ్యాఖ్యలు!


