Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్S Jaishankar : అగ్రరాజ్యం వాదన అసంబద్ధం.. జైశంకర్ దౌత్యనీతి ధీరత్వం!

S Jaishankar : అగ్రరాజ్యం వాదన అసంబద్ధం.. జైశంకర్ దౌత్యనీతి ధీరత్వం!

India’s independent foreign policy : ఒకవైపు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించాలంటూనే, మరోవైపు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై సుంకాల కొరడా ఝుళిపించడం… అమెరికా అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి వెనుక ఆంతర్యమేమిటి? అగ్రరాజ్యం ఆరోపణలను మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తనదైన శైలిలో, తిరుగులేని వాస్తవాలతో ఎలా తిప్పికొట్టారు? మాస్కో వేదికగా ఆయన చేసిన ఆ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న దౌత్యపరమైన వ్యూహమేమిటి..? 

- Advertisement -

మాస్కో నుంచి ఘాటు స్పందన : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఏకపక్ష సుంకాలపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కో వేదికగా తీవ్రంగా ధ్వజమెత్తారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, వాషింగ్టన్ తర్కం గందరగోళంగా ఉందని, వారి మాటలకు చేతలకు పొంతన లేదని తనదైన శైలిలో చురకలంటించారు. “గత కొన్నేళ్లుగా ప్రపంచ ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించాలని, అందుకోసం అన్ని దేశాలూ కృషి చేయాలని అమెరికానే చెబుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలోనూ అదే సూచించింది. కానీ ఆచరణలో మాత్రం భారత్ విషయంలో పూర్తి భిన్నంగా వ్యవహరించడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిలువుటద్దం” అని జైశంకర్ వ్యాఖ్యానించారు.

లెక్కలతో సహా తిప్పికొట్టిన జైశంకర్ : అగ్రరాజ్యం ఆరోపణలను కేవలం మాటలతో కాకుండా, కఠోర వాస్తవాలతో సహా జైశంకర్ ఎండగట్టారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నది కేవలం భారత్ మాత్రమే కాదని, మనకంటే ఎక్కువగా కొంటున్న దేశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

చమురు: “రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్నది భారత్ కాదు, చైనా.”
ఎల్.ఎన్.జీ: ద్రవరూప సహజ వాయువు (LNG) విషయంలో, రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నది ఐరోపా సమాఖ్య (EU) దేశాలే తప్ప, భారత్ కాదు. ఈ వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచి, కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాన్ని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు.

ట్రంప్ సుంకాల దాడి నేపథ్యం : వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్, చైనాల చమురు కొనుగోళ్లే ఆర్థిక ఊతమిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అయితే, చైనాపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడి, భారత్‌పై ప్రతాపం చూపారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మొదట 25% ప్రతీకార సుంకాలు, ఆపై మరో 25% పెనాల్టీ సుంకాన్ని కలిపి మొత్తం 50% భారాన్ని మోపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయాలని నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.

భారత్ ప్రయోజనాలే ముఖ్యం : ఈ ఒత్తిడిని జైశంకర్ సున్నితంగా తిరస్కరించారు. దేశానికి ఇంధన భద్రత ముఖ్యం కాబట్టి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆయన గట్టిగా సమర్థించారు. “2022 తర్వాత రష్యాతో వాణిజ్యం పెంచుకున్నది కేవలం మేమే కాదు. ప్రపంచంలోని దక్షిణాది దేశాల్లో కొన్ని మాకంటే ఎక్కువ వాణిజ్యం చేస్తున్నాయి” అని పేర్కొంటూ, ఇది కేవలం భారత్‌కు మాత్రమే పరిమితమైన విషయం కాదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు భారత స్వతంత్ర విదేశాంగ విధానానికి, జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామన్న దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad