Japan’s First Female PM Sanae Takaichi: దశాబ్దాల రాజకీయ చరిత్రలో జపాన్ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ‘ఉక్కు మహిళ’ మార్గరెట్ థాచర్‌కు వీరాభిమానిగా చెప్పుకునే, చైనా పట్ల కఠిన వైఖరి కలిగిన సామాజిక సంప్రదాయవాది సనా తకైచీ (64) దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా మంగళవారం నియమితులయ్యారు. గత ఐదేళ్లలో జపాన్‌కు ఈమె ఐదో ప్రధాని కావడం గమనార్హం.
అయితే, ఎన్నో ఆశలు రేకెత్తించిన ఆమె ప్రయాణం, కేబినెట్ కూర్పుతో తొలిరోజే వివాదాస్పదమైంది. మహిళలకు పెద్ద పీట వేస్తానన్న ఆమె హామీ గాలి మూటగానే మిగిలిపోయింది.
నాటకీయ రాజకీయ పరిణామాలు
పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే తకైచీ మెజారిటీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతకుముందు అక్టోబర్ 4న ఆమె అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అయితే, దశాబ్దాలుగా జపాన్‌ను పాలిస్తున్న LDP ప్రస్తుతం ప్రజాదరణ కోల్పోతోంది. దానికి తోడు, తకైచీ సంప్రదాయవాద ధోరణులు, పార్టీ నిధుల కుంభకోణం కారణంగా, కీలక మిత్రపక్షమైన కొమెఇటో పార్టీ (Komeito party) అక్టోబర్ 10న సంకీర్ణం నుండి వైదొలగింది.
ఇది తకైచీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. చివరి నిమిషంలో, ఆమె సంస్కరణవాద, మితవాద పార్టీ అయిన జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (JIP)తో సోమవారం సాయంత్రం పొత్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆమె ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడపాల్సిన గడ్డు పరిస్థితి ఏర్పడింది.
ముందున్న సవాళ్ల వలయం
ప్రధానిగా తకైచీ ముందున్నది ముళ్లబాటే. వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంలోని పలు అంశాలు ఇంకా తేలలేదు. రష్యా నుండి ఇంధన దిగుమతులు ఆపాలని, రక్షణ బడ్జెట్ పెంచాలని జపాన్‌పై ట్రంప్ నుండి తీవ్ర ఒత్తిడి ఉంది.
వీటితో పాటు, పడిపోతున్న జనాభాను నివారించడం, కుంటుపడిన ఆర్థిక వ్యవస్థకు జీవం పోయడం, చైనా నుండి పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడం వంటి క్లిష్టమైన సవాళ్లు ఆమె ముందున్నాయి.
‘నార్డిక్’ హామీ.. రియాలిటీ షాక్!
తకైచీ ఎన్నిక జపాన్ మహిళల్లో కొత్త ఆశలు నింపింది. ప్రపంచ ఆర్థిక ఫోరం 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్‌లో జపాన్ 148 దేశాల్లో 118వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో, తన కేబినెట్‌లో “నార్డిక్ దేశాల (ఐస్‌లాండ్, ఫిన్లాండ్, నార్వే)” స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తానని తకైచీ గత నెలలో గట్టిగా హామీ ఇచ్చారు.
కానీ, మంగళవారం ఆమె ప్రకటించిన 19 మంది సభ్యుల కేబినెట్ జాబితా చూసి అందరూ నివ్వెరపోయారు. ఆమె ఇచ్చిన “నార్డిక్” హామీకి పూర్తి భిన్నంగా, కేబినెట్‌లో ఆమెతో కలుపుకొని కేవలం ముగ్గురు మహిళలకు (ఇద్దరు ఇతర మహిళలకు) మాత్రమే స్థానం దక్కింది. వీరిలో సట్సుకి కటయామా (Satsuki Katayama) దేశపు మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రిగా, కిమి ఒనోడా (Kimi Onoda) ఆర్థిక భద్రతా మంత్రిగా నియమితులయ్యారు.
ఒకవైపు మహిళల ఆరోగ్య సమస్యలపై, మెనోపాజ్ గురించి బహిరంగంగా మాట్లాడే తకైచీ, మరోవైపు వివాహిత జంటలు వేర్వేరు ఇంటిపేర్లను కలిగి ఉండటాన్ని వ్యతిరేకిస్తారు. అలాగే, రాచరిక వారసత్వం కేవలం మగవారికే దక్కాలని గట్టిగా వాదిస్తారు. ఈ వైరుధ్యమే ఆమె కేబినెట్ కూర్పులో ప్రతిబింబించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తమ్మీద, బలమైన నాయకురాలిగా పేరున్న తకైచీ, తన గురువు షింజో అబే అడుగుజాడల్లో “అబెనామిక్స్” తరహా ఆర్థిక విధానాలతో దేశాన్ని గట్టెక్కిస్తారో, లేక రాజకీయ వైరుధ్యాలు, ప్రజా వ్యతిరేకత మధ్య ఒంటరవుతారో వేచి చూడాలి.
ALSO READ: Netanyahu: భారత పర్యటనకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం..!


