Japan’s Millionaire Janitor: జపాన్‌లో 56 ఏళ్ల కోయిచి మత్సుబారా అనే వ్యక్తి జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంవత్సరానికి 3 కోట్ల యెన్ సుమారు రూ.1.8 కోట్లు రెంటల్ ఆదాయం, పెట్టుబడుల ద్వారా సంపాదిస్తున్నప్పటికీ.. ఆయన టోక్యోలో ఒక భవనంలో శుభ్రం చేసే పనివాడిగా జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన స్టోరీ చాలా మందికి “సాదాసీదా జీవితం”కు ప్రేరణగా మారింది.
మత్సుబారా టోక్యోలోని ఒక నివాస భవనంలో ఉద్యోగిగా పబ్లిక్ ప్రదేశాలు ఊడ్చడం, ప్రాథమిక మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తున్నారు. నెలకు ఆయనకు 1 లక్ష యెన్ (సుమారు రూ.60,000) మాత్రమే జీతం వస్తుంది. ఇది టోక్యో సగటు జీతమైన 3.5 లక్షల యెన్ (సుమారు రూ.2 లక్షలు) కంటే చాలా తక్కువ. అయినప్పటికీ ఆయన ఆ భవనంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరుగా పరిగణించబడుతున్నారు.
ఫ్యాక్టరీ కార్మికుడిగా తన కెరీర్ ప్రారంభించిన మత్సుబారా, చిన్నప్పటి నుంచే డబ్బును తక్కువగా ఖర్చు చేయటం అలవాటు చేసుకున్నారు. బాల్యంలో తల్లిదండ్రుల నుంచి పొదుపు చేయడం నేర్చుకున్నారు. ఫ్యాక్టరీలో నెలకు 1.8 లక్ష యెన్ (సుమారు రూ.లక్ష) సంపాదిస్తూ, జాగ్రత్తగా డబ్బు దాచుకున్నారు. కేవలం 30 లక్ష యెన్ (సుమారు రూ.18 లక్షల) పొదుపుతో ఆయన మొదటి స్టూడియో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. హౌసింగ్ మార్కెట్ ఆ సమయంలో పడిపోవడంతో.. ఖాళీగా ఉండకుండా ఆస్తిని సక్రమంగా నిర్వహించి, లోన్‌ను త్వరగా తీర్చేశాడు. అలాంటి చిన్నచిన్న పెట్టుబడులు వలనకు ప్రస్తుతం టోక్యో నగరంలో 7 ఫ్లాట్లు ఉన్నాయని వెల్లడించారు.
ఆయన షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో కూడా పెట్టుబడులు పెట్టి స్థిరమైన ఆదాయాన్ని సాధించారు. అయినప్పటికీ చిన్న అద్దె ఇంట్లో ఉంటూ… స్వయంగా వంట చేసుకుంటారు. కొత్త బట్టలు కొనకుండా పదేళ్లుగా అదే బట్టలు ధరిస్తున్నారు. సాదాసీదా స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ, సైకిల్‌పై నగరంలో తిరుగుతున్నాడు. ప్రతి ఉదయం లేవగానే శుభ్రం చేయడం తనకు ఆత్మసంతృప్తి కలిగిస్తుందని చెప్పాడు. ఈ పని డబ్బు కోసం కాదు, శరీర దారుఢ్యం కోసం అని మత్సుబారా చెప్పారు. ఆయన 60 ఏళ్లు వచ్చే వరకు ఈ పని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.


