Donald Trump: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) చేసిన తాజా వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో చర్చను రేకెత్తించాయి. ఆయన స్పష్టంగా “ప్రెసిడెంట్ ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని.. తన పదవీకాలాన్ని పూర్తి చేసి ప్రజల కోసం మరిన్ని పనులు చేస్తారు” చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. ఒకవేళ ఏదైనా “భయంకరమైన విషాద ఘటన” సంభవిస్తే తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. అసలు ఉన్నట్టుండి వాన్స్ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ట్రంప్ ఆరోగ్యంపై పలు కథనాలు వస్తున్నందున తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు వాన్స్ చెబుతున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం మాటల వెనుక అంతరార్థాన్ని పట్టే పనిలో ఉన్నారు.
41 ఏళ్ల వాన్స్ ఉపాధ్యక్షుడిగా పదవిలో 200 రోజులు పూర్తి చేసిన తర్వాత తనకు వచ్చిన అనుభవం అత్యున్నత పదవిని కూడా నిర్వహించగల సామర్థ్యాన్ని ఇచ్చిందని తెలిపారు. “నాకు లభించినది అమెరికాలోనే ఉత్తమ ‘ఆన్-ద-జాబ్’ ట్రైనింగ్” అంటూ స్పష్టం చేశారు. తన వయసులోని చాలా మంది కంటే ట్రంప్ అధిక శ్రమ, అధిక ప్రతిభ చూపుతున్నారని వాన్స్ పేర్కొనడం, అధ్యక్షుడిపై తన నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది.
ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియుంగ్ తో భేటీ సందర్భంగా ప్రెసిడెంట్ ట్రంప్ చేతిపై కనిపించిన గాయం అమెరికా మీడియా అలాగే అక్కడి ప్రజల్లో.. ప్రెసిడెంట్ ఆరోగ్యంపై ఊహాగానాలకు దారి తీసింది. దానిపై స్పందిస్తూ వాన్స్.. ఆ గాయానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదని, అధ్యక్షుడి చురుకుదనం చూసి ఎలాంటి అనుమానం ఉంచడానికి అవసరం లేదని పేర్కొన్నారు. “తనకన్నా చిన్న వయస్సు వాళ్లకంటే ట్రంప్ ఆలస్యంగా నిద్రపోతారు, ఉదయం తొందరగా లేస్తారు, అలా నిరంతరం యాక్టివ్ గా ఉంటారు” అని వాన్స్ వివరించారు.
అమెరికా రాజకీయాల్లో వయస్సు, ఆరోగ్యం ఎప్పుడూ సున్నితమైన అంశమే. గతంలో రోనాల్డ్ రీగన్, జో బైడెన్ వంటి అధ్యక్షుల ఆరోగ్యంపై కూడా భారీగా చర్చ జరిగింది. ఈ క్రమంలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ అనారోగ్యంపై వస్తున్న గుసగుసలను కొంత వరకైనా సమాధానం చెప్పినట్టేనని అభివర్ణించబడుతున్నాయి. మరోవైపు తాను అవసరమైతే సిద్ధంగా ఉన్నానని చెప్పడం ద్వారా ఉపాధ్యక్షుడిగా తన సంసిద్ధతను, బాధ్యతాయుతమైన వైఖరిని కూడా జేడీ వాన్స్ చూపించారు.
అమెరికా రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, వాన్స్ వ్యాఖ్యలు రెండు సంకేతాలను ఇస్తున్నాయి. మొదటిది ట్రంప్ ఆరోగ్యం గురించి ఉన్న అనుమానాలను తగ్గించాలనే ప్రయత్నం. ఇక రెండవది తనను జాతీయ నాయకుడిగా ముందుకు తీసుకువెళ్లే రాజకీయ వ్యూహం ఉందని ప్రకటించటం. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ లోపల వాన్స్ ను కొత్తతరం నాయకత్వంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాన్స్ వాక్యాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మొత్తానికి జేడీ వాన్స్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసి, రాబోయే కాలంలో రిపబ్లికన్ లోపలి శక్తి సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు ఎంతవరకు వాస్తవమో చెప్పడం కష్టం కానీ.. ఉపాధ్యక్షుడి స్పష్టమైన వాఖ్యలు ఆ ఊహాగానాలను కొంతమేరకు తగ్గించాయని చెప్పుకోవచ్చు.


