US-India strategic partnership : ప్రపంచ రాజకీయ యవనికపై అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారత్‌ను తమవైపు తిప్పుకోవడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు డొనాల్డ్ ట్రంప్ విధానాలు గండి కొడుతున్నాయా..? రష్యా, చైనాలకు వ్యతిరేకంగా భారత్‌ను కీలక భాగస్వామిగా మలుచుకునే సుదీర్ఘ ప్రణాళికలను ట్రంప్ తన ఏకపక్ష నిర్ణయాలతో నీరుగారుస్తున్నారా..? అవుననే అంటున్నారు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్. డోనాల్డ్ ట్రంప్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలను నిర్లక్ష్యం చేసి, చైనాతో మెతకగా వ్యవహరించడం అమెరికా దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు ట్రంప్ విధానాలు అమెరికా ప్రయోజనాలకు ఎలా చేటు చేస్తాయి…? బోల్టన్ ఆందోళనకు అసలు కారణాలేంటి..?
అమెరికాకే చేటు.. వ్యూహాత్మక తప్పిదం : భారత్ వంటి ప్రజాస్వామ్య మిత్రదేశం పట్ల కఠినంగా వ్యవహరించడం, అదే సమయంలో నియంతృత్వ చైనాకు మినహాయింపులు ఇవ్వడం ట్రంప్ చేస్తున్న అతిపెద్ద తప్పు అని జాన్ బోల్టన్ ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. “రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే 50% సుంకాలు విధిస్తామని బెదిరించడం, అదే రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు కొంటున్న చైనాపై మాత్రం మౌనంగా ఉండటం ఎలాంటి వ్యూహం..?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ పక్షపాత వైఖరి వల్లే భారత్ తీవ్రంగా స్పందించిందని, ఇది ఆ దేశాన్ని చైనా, రష్యాలతో మరింత దగ్గర చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మూడు దేశాలు ఏకమైతే అది అమెరికా ఎదుర్కోబోయే అతిపెద్ద వ్యూహాత్మక సవాల్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత : ట్రంప్ విధానాలపై కేవలం బోల్టన్ మాత్రమే కాదు, సొంత రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత సంతతి నాయకురాలు, మాజీ గవర్నర్ నిక్కీ హేలీ సైతం ట్రంప్ ద్వంద్వ వైఖరిని గతంలోనే తప్పుపట్టారు. “రష్యా నుంచి భారత్ చమురు కొనకూడదు, కానీ చైనా కొనవచ్చా? అత్యధికంగా కొంటున్న చైనాకు 90 రోజుల సుంకుల మినహాయింపు ఇవ్వడంలో ఆంతర్యమేమిటి..?” అని ఆమె ప్రశ్నించడం ట్రంప్ విధానాల్లోని డొల్లతనాన్ని బయటపెట్టింది. భారత్ లాంటి బలమైన, నమ్మకమైన మిత్రుడిని దూరం చేసుకోవద్దని ఆమె ట్రంప్‌కు బహిరంగంగానే సూచించారు.
సంబంధాలపై ప్రతికూల ప్రభావం : ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలు అమెరికా-భారత్ మధ్య దశాబ్దాలుగా నిర్మించుకున్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని అమెరికా మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ చర్యలు రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లను ఏమాత్రం నిలువరించలేకపోయాయి. పైగా, తమ ఇంధన భద్రత కోసం ఈ కొనుగోళ్లు తప్పనిసరని భారత్ మరింత గట్టిగా వాదించింది. ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయ వేదికలపై అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది” అని ఆయన విశ్లేషించారు. చైనాను కట్టడి చేయాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో, భారత్ వంటి కీలక భాగస్వామిని సుంకాల పేరుతో దూరం చేసుకోవడం ఆత్మహత్యాసదృశ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


