Kavitha about new party: తెలంగాణ జాగృతిని దేశానికి రోల్ మోడల్‌గా నిలపాలన్నదే తన సంకల్పమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. లండన్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రవాస వాసులతో ముఖాముఖిలో కవిత మాట్లాడారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తిరిగి పెట్టే వరకు పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు. ఈ మేరకు కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించిన కవిత.. పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానని వెల్లడించారు.
నా వెనుక ఏ జాతీయ పార్టీ లేదు
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, తెలంగాణను భ్రష్టు పట్టిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ డీఎన్ఏ తనకు సరిపడదని తెలిపిన ఆమె.. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని కవిత స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తేవడంపై తమకు స్పష్టమైన ఆలోచన ఉందని కవిత ఉద్ఘాటించారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని, తనకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని వెల్లడించారు.
20 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డా
‘ఇరవై ఏళ్లు పార్టీ కోసం పని చేశాను. కొందరిలో స్వార్థం పురుడుపోసుకుంది. వారి వల్ల కోట్లాది మంది బాధపడవద్దనేదే నా తపన. పార్టీలో చీలికలు రావొద్దనే ఎంతటి ఇబ్బందినైనా తట్టుకొని నిలబడ్డా. పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా. నా ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయి’. అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/saddula-bathukamma-in-telangana/
తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ రోజు మాట్లాడవలసి వచ్చిందని.. పార్టీ తనను వద్దుకున్నదని, అందుకే పార్టీ ఇచ్చిన పదవిని వదులుకున్నానని కవిత వెల్లడించారు. జైలు జీవితం తనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందన్న కవిత.. కష్టమవుతుందని తెలిసినా కేసీఆర్ బిడ్డగా ధైర్యంగా పంథాను ఎంచుకుంటానని స్పష్టం చేశారు. నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పనిచేయాలని పిలుపునిచ్చారు.


