Homeఇంటర్నేషనల్America: చైనా వాణిజ్య అక్రమాలపై అమెరికా కొరడా

America: చైనా వాణిజ్య అక్రమాలపై అమెరికా కొరడా

వాషింగ్టన్(తెలుగుప్రభ): అమెరికా ప్రతినిధుల సభ (యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) చైనాకు చెందిన కంపెనీలు, అనుబంధ సంస్థలు పాల్పడుతున్న వాణిజ్య నేరాలను అరికట్టే దిశగా బిల్లును ఆమోదించింది. చైనా మద్దతున్న సంస్థల వాణిజ్య అక్రమాలపై విచారణ వేగవంతం చేయడానికి , శిక్షలను కఠినతరం చేయడానికి అమెరికా న్యాయశాఖకు అదనపు అధికారాలను కల్పిస్తూ రూపొందించిన ‘ప్రొటెక్టింగ్ అమెరికన్ ఇండస్ట్రీ అండ్ లేబర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ క్రైమ్స్ యాక్ట్’ను ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనాపై ప్రత్యేక కమిటీ ఛైర్మన్ జాన్ మూలేనార్‌తో పాటు ఎంపీలు ఆష్లీ హిన్సన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం.. అమెరికా విచారణ విభాగానికి అనుబంధంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధానంగా సుంకాలు , పన్నుల ఎగవేత, దిగుమతి-ఎగుమతి నిబంధనల ఉల్లంఘన, వాణిజ్య ఆధారిత మనీ లాండరింగ్, స్మగ్లింగ్ వంటి అంతర్జాతీయ అక్రమాలపై దృష్టి సారిస్తుంది. చైనా అనుసరిస్తున్న అనుచిత వాణిజ్య విధానాల వల్ల అమెరికన్ తయారీదారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా ప్రత్యేక న్యాయవాదులు, విచారణాధికారులను నియమించడమే కాకుండా, ఫెడరల్ , స్థానిక దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక శిక్షణను అందించనున్నారు. అంతేకాకుండా, అక్రమాలకు పాల్పడే చైనా సంస్థలపై ఒకేసారి క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలకు ఈ బిల్లుతో చెక్ పడుతుందని అమెరికా ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News