Khalistani Group Disrupts India’s Independence Day Celebrations: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. మెల్బోర్న్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భారతీయ పౌరులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటుండగా, ఖలిస్తానీ మద్దతుదారులు ఆ వేడుకలను అడ్డుకున్నారు.
‘ది ఆస్ట్రేలియా టుడే’ నివేదిక ప్రకారం, ఖలిస్తాన్ మద్దతుదారులు వేడుకలను అడ్డుకొని ఖలిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఖలిస్తానీ గ్రూప్ వేర్పాటువాద నినాదాలు చేయగా, దానికి ప్రతిగా భారత జాతీయవాదులు దేశభక్తి గీతాలు ఆలపించారు.
సమాచారం అందుకొని వెంటనే అక్కడికి చేరుకున్న ఆస్ట్రేలియా అధికారులు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అడ్డుకున్నారు. అనంతరం, కాన్సులేట్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ సమయంలో “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” అనే నినాదాలు మార్మోగాయి.
ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెలలో బరోనియాలోని స్వామినారాయణ ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు విద్వేషపూరిత నినాదాలతో దాడి చేశారు. అంతేకాకుండా, సమీపంలోని కొన్ని ఆసియా రెస్టారెంట్లను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, ఖలిస్తానీ తీవ్రవాదులకు స్థానం ఇవ్వొద్దని కెనడా, యూకే, ఆస్ట్రేలియాలను కోరారు.


