Khamenie Death Iran: అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో భీకర వాతావరణం నెలకొంది. ఖమైనీ మరణానికి ప్రతీకారంగా గంటల వ్యవధిలోనే ఇరాన్ సైన్యం విరుచుకుపడింది. కువైట్, దుబాయ్‌లోని అమెరికా బేస్‌లే లక్ష్యంగా క్షిపణి దాడులు చేస్తోంది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సహా పలు కీలక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. యుద్ధం విస్తరించే ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇరాన్ అణు చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుని భయంకర వాతావరణాన్ని తలపిస్తున్నాయి. టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై జరిగిన ఈ భీకర వైమానిక దాడులపై ఇరాన్ తన ప్రతీకార జ్వాల సెగలను కక్కుతోంది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’ పేరుతో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్ జీసీ).. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. శత్రువులకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరిస్తూ ప్రతిదాడులకు పాల్పడుతోంది.
Also Read: https://teluguprabha.net/international-news/iran-tensions-impact-india-oil-prices-economy/
అమెరికానే టార్గెట్
ఇరాన్ ఐదో దశ దాడుల్లో బాగా కువైట్‌లోని అబ్దుల్లా ముబారక్ ప్రాంతంలోని అమెరికన్ నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ క్షిపణులు, 12 డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో బేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ధ్వంసమైంది. పలువురు అమెరికన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. అటు హిందూ మహాసముద్రంలోనూ అలజడి సృష్టించిన ఇరాన్.. అమెరికా నౌకలకు ఇంధనం సరఫరా చేస్తున్న కంబాట్ సపోర్ట్ షిప్‌పై ‘ఖద్ర 380’ క్షిపణులతో దాడులకు దిగింది.
అదేవిధంగా దుబాయ్‌లోని జెబెల్ అలీ యాంకరేజ్‌లో అమెరికాకు ఆయుధాలు చేరవేస్తున్న నౌకపై సైతం డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడుల తీవ్రతకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోగా.. అంతకుముందు పామ్ ఐలాండ్, బుర్జ్ అల్ అరబ్ ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్లు సమాచారం. పర్షియన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇరాక్ కుర్దిస్తాన్‌లోని అమెరికా బేస్‌లపై కూడా ఇరాన్ ఎయిర్ ఫోర్స్ బాంబు దాడులతో చెలరేగింది.
నరకం తప్పదు..
శత్రువులకు నరక ద్వారాలు తెరిచి ఉంచుతాం.. ఇమామ్ హంతకులకు కచ్చితంగా శిక్ష పడుతుందంటూ టెలిగ్రామ్ వేదికగా ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ఖమేమీ మృతికి ప్రతీకార చర్యగా ‘చరిత్రలోనే అత్యంత భయంకరమైన అఫెన్సివ్ ఆపరేషన్’ చేపడతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. కాగా, అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కతార్‌లలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో శత్రువులకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: https://teluguprabha.net/international-news/iran-tensions-impact-india-oil-prices-economy/
ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటిపోతుండటంతో యుద్ధ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే హింసను ఆపాలని, లేదంటే ప్రపంచ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని స్పష్టం చేశారు. అటు రష్యా, యూరోపియన్ యూనియన్ కూడా ఇరు పక్షాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశాయి. ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి.

