North Korea : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన విచిత్రమైన, కఠినమైన నిబంధనలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈసారి ఆయన పాశ్చాత్య సంస్కృతిని తమ దేశంలోకి రాకుండా అరికట్టడానికి సాధారణ ఆంగ్ల పదాలపై కూడా నిషేధం విధించారు. దీనిలో భాగంగా, ఇకపై ‘హ్యాంబర్గర్’, ‘ఐస్‌క్రీమ్’, ‘కరావోకే’ వంటి పదాలను ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త పదజాలం, కఠినమైన శిక్షలు
ఈ కొత్త నిబంధనల ప్రకారం, ‘హ్యాంబర్గర్’ను ‘రొట్టెల మధ్య రుబ్బిన గొడ్డు మాంసం’ (దాజిన్-గోగి గ్యోపాంగ్) అని, ‘ఐస్‌క్రీమ్’ను ‘ఎసుకిమో’గా, ‘కరావోకే’ను ‘తెరపై సంగీత పరికరం’గా పిలవాలని ఆదేశించారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో పనిచేసే గైడ్‌లకు ఈ కొత్త పదజాలంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పర్యాటకులతో సంభాషించేటప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన పదాలనే వాడాలని వారికి స్పష్టం చేశారు.
ఈ నిబంధనలు కేవలం పదాలకే పరిమితం కాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తర కొరియా ప్రభుత్వం తమ దేశీయ సంస్కృతిని కాపాడటానికి, ముఖ్యంగా దక్షిణ కొరియా, ఇతర శత్రు దేశాల నుంచి వచ్చే సమాచారాన్ని, ప్రభావాలను అణచివేయడానికి తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి బహిరంగ మరణశిక్షలు సైతం విధిస్తున్నారు. ఈ కఠినమైన చర్యల వెనుక ప్రజల్లో భయాన్ని సృష్టించి, వారిని నియంత్రించాలనే ఉద్దేశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
‘సామ్యవాద వ్యతిరేక’ కార్యకలాపాలు
‘సామ్యవాద వ్యతిరేక’ కార్యకలాపాలను అరికట్టడానికి ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కూడా పనిచేస్తోంది. వీరు ప్రజల ఇళ్లపై దాడులు చేసి, విదేశీ కంటెంట్‌ను చూస్తున్న వారిని పట్టుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, చాలామంది ఉత్తర కొరియా ప్రజలు రహస్యంగా విదేశీ సినిమాలను, సంగీతాన్ని చూస్తున్నారని సమాచారం. ఈ పరిణామాలు కిమ్ పాలనలో ప్రజల స్వేచ్ఛ ఎంతవరకు హరించబడుతుందో మరోసారి రుజువు చేస్తున్నాయి.


