Landing fails twice Panic among passengers: కొలంబియాలోని ఓ విమానంలో ప్రయాణిస్తున్న వారికి భారీ ప్రమాదం తప్పింది. కొలంబియాలోని పర్వత శిఖరాల్లో ఉన్న పాస్టో ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో, విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో రెండుసార్లు అంతరాయం ఏర్పడింది. దీంతో, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైలట్ అప్రమత్తతతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో రికార్డైన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ విమానం కొలంబియాలోని బొగోటా నుంచి పాస్టోలోని విమానాశ్రయానికి బయలుదేరింది. ఈ ఎయిర్‌పోర్టు సముద్ర మట్టానికి దాదాపు 6 వేల అడుగుల ఎత్తులో ఉంది. దట్టమైన పొగమంచు, బలమైన గాలులు వీయడంతో పైలట్ తొలుత విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి ప్రయత్నించినా కుదరలేదు. దీంతో, అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనలకు గురయ్యారు. భయంతో కొందరు అరవడం, మరికొందరు ఏడవడం, ఇంకొందరు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ల అరుపులు, కేకలతో విమానంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
Also read: Karnataka : కన్నడ నాట కాంగ్రెస్ కుర్చీలాట.. ఓబీసీలకు ‘హస్తం’ వెన్నుపోటు.?
పైలెట్ అలెర్ట్.. తప్పిన ప్రమాదం..
ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు. వెంటనే విమానాన్ని తిరిగి బొగోటాకు మళ్లించాడు. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం కుదుటపడ్డాక విమానం ఎట్టకేలకు పాస్టోలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ ఘటనపై సదరు విమానయాన సంస్థ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఇలా జరిగిందని పేర్కొంది. క్లిష్ట పరిస్థితుల్లో పైలట్ సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించింది.

