చిలీలోని ఆండిస్ పర్వతాల్లో ఉన్న లాస్కర్ అగ్నిపర్వతం బద్దలైంది. అండిస్ పర్వత శ్రేణుల్లో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లో లాస్కర్ కూడా ఒకటి. అగ్నిపర్వతం పేలడంతో.. దాని నుండి భారీగా పొగ, ధూళి, విష వాయువులు వెలువడుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం(డిసెంబర్ 10,2022) మధ్యాహ్నం 12.36 గంటలకు అగ్నిపర్వతం పేలినట్లు నేషనల్ జియాలజి అండ్ మైనింగ్ సర్వీస్ పేర్కొంది. అగ్నిపర్వతం విస్ఫోటన సమయంలో స్వల్పంగా భూమి కంపించిందని తెలిపింది. ఆకాశంలో 6 వేల మీటర్ల ఎత్తువరకూ దట్టమైన పొగ కమ్ముకుంది.
కాగా.. విస్ఫోటనానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్ర్బే పట్టణంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీగా విష వాయువులు వస్తుండటంతో.. వీలైనంత త్వరగా నివాసాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. లాస్కర్ ఎత్తు 5,592 మీటర్లు ఉంది. ఈ అగ్నిపర్వతం చివరి సారిగా 1993లో పేలింది. 2006, 2015లో కూడా స్వల్పంగా లావాను వెదజల్లింది. సముద్ర భూగర్భంలోనూ లాస్కర్ వంటి కొన్ని అగ్నిపర్వతాలున్నాయి. అవి పేలితే సునామీలు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి.