London Streets Painted Red By Paan: మన దేశంలో గోడల మీద, రోడ్ల పక్కన, మెట్ల మీద ఎర్రటి పాన్ మరకలు చూడటం చాలా సాధారణం. “ఇక్కడ ఉమ్మి వేయరాదు” అని రాసి ఉన్న చోటే మరీ ఎక్కువగా ఉమ్మి వేస్తుంటారు కొందరు. అయితే, దురదృష్టవశాత్తు ఈ అలవాటు ఇప్పుడు సరిహద్దులు దాటింది. అందమైన నగరంగా, శుభ్రతకు మారుపేరుగా నిలిచే లండన్ (London) వీధుల్లో ఇప్పుడు మనోళ్ల ‘ఎర్రటి సంతకాలు’ దర్శనమిస్తున్నాయి. ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే.. లండన్‌లోని Brent Council ఈ పాన్ మరకలను శుభ్రం చేయడానికే ఏటా అక్షరాలా రూ. 35 లక్షలు ఖర్చు చేస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఇప్పుడు అక్కడి యంత్రాంగం సీరియస్ అయ్యింది.
ALSO READ: Putin’s India Visit: ఢిల్లీ దర్బార్‌కు పుతిన్.. వ్యూహాత్మక బంధానికి కొత్త ఊపు! ప్రపంచమంతా ఉత్కంఠ!
వెంబ్లీ వీధుల్లో ఎర్రటి చిత్రాలు
లండన్‌లోని బ్రెంట్ (Brent) కౌన్సిల్ పరిధిలో, ముఖ్యంగా వెంబ్లీ (Wembley) ప్రాంతంలో దక్షిణ ఆసియా వాసులు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇక్కడ ఎటు చూసినా పాన్, గుట్కా నమిలి ఉమ్మి వేసిన మరకలే కనిపిస్తున్నాయి. ఫుట్‌పాత్‌లు, దుకాణాల మెట్లు, టెలిఫోన్ బూత్‌లు, చివరికి అందంగా పెంచిన పూల మొక్కల కుండీలు కూడా ఈ ఎర్రటి మరకలతో నిండిపోయాయి. లాలాజలం, పొగాకు కలిసిన ఈ మిశ్రమం ఎండిపోయి రోడ్లపై అసహ్యంగా కనిపిస్తోంది. ఇది కేవలం చూడటానికి బాగోలేకపోవడమే కాదు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను, పర్యావరణ కాలుష్యాన్ని కూడా కలిగిస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొండి మరకలు.. వదలని వైనం
ఈ మరకలు ఎంత మొండిగా ఉంటున్నాయంటే.. హై-ప్రెషర్ వాటర్ జెట్‌లతో (High-powered cleaning jets) శుభ్రం చేసినా కూడా కొన్ని సార్లు పోవడం లేదని స్థానిక కౌన్సిల్ తెలిపింది. ప్రవాస భారతీయులు లేదా ఆసియా దేశాల వారు తమ అలవాట్లను విదేశాలకు తీసుకెళ్లి, అక్కడి బహిరంగ ప్రదేశాలను ఇలా నాశనం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దొరికితే జేబుకి చిల్లే..
ఇక లాభం లేదనుకున్న బ్రెంట్ కౌన్సిల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ సమస్యపై ‘జీరో టాలరెన్స్’ (Zero-tolerance) విధానాన్ని పాటిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను రంగంలోకి దించారు. ఎవరైనా రోడ్లపై పాన్ ఉమ్మి వేస్తూ పట్టుబడితే, వారికి అక్కడికక్కడే 100 పౌండ్ల వరకు జరిమానా విధిస్తారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 12,000 అన్నమాట. ఇప్పటికే అత్యధికంగా పాన్ ఉమ్మి వేస్తున్న మూడు ప్రాంతాలను గుర్తించి అక్కడ హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు.
అధికారుల వార్నింగ్
ఈ విషయంపై కౌన్సిల్ సభ్యురాలు కృపా సేథ్ (Cllr Krupa Sheth) ఘాటుగా స్పందించారు. “మా వీధుల అందాన్ని చెడగొట్టే వారిని ఉపేక్షించేది లేదు. పాన్ ఉమ్మి వేసి రోడ్లను నాశనం చేస్తే ఊరుకోం. బ్రెంట్ కౌన్సిల్ తో పెట్టుకోవద్దు, కచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాం, జరిమానా వసూలు చేస్తాం” అని ఆమె తేల్చి చెప్పారు. మన బాధ్యతారాహిత్యం వల్ల విదేశాల్లో మన దేశ పరువు పోతోందని నెటిజన్లు కూడా ఈ వార్తపై మండిపడుతున్నారు.

