Russia Earthquake 2025: రష్యాను మరోమారు భారీ భూకంపం వణికించింది. శనివారం ఉదయం రష్యా తూర్పు తీరంలోని కమ్చాట్కా ద్వీపకల్పంలో ఈ భారీ భూకంపం సంభవించగా.. నెల రోజుల క్రితం 8.7 తీవ్రతతో ఇదే ప్రాంతంలో తీవ్ర అలజడి సృష్టించింది. కాగా, ఈ సారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) పేర్కొంది.
సునామీ హెచ్చరికలు.!
రష్యాలో నెల రోజుల వ్యవధిలోనే ఈ శక్తిమంతమైన భూకంపం సంభవించడంతో అధికారులు సమీప తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ మాత్రం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1 గా నమోదైనట్లు తెలిపింది. కాగా, ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక సంస్థ ప్రకటించింది. ఇక, అటు జపాన్‌లోనూ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.
పెద్ద ఎత్తున అలల తాకిడి.!
కమ్చాట్కా ప్రాంత పరిపాలనా కేంద్రమైన పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్కీ నగరానికి తూర్పున 111 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 39.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌జీఎస్(USGS) వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అప్రమత్తమైంది. భూకంప కేంద్రానికి 300 కి.మీ పరిధిలోని రష్యా తీర ప్రాంతాలపై ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
నెల రోజుల వ్యవధిలోనే..
ఈ ఏడాది జులై 20న కూడా ఇదే ప్రాంతంలో 8.7 తీవ్రతతో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో నాలుగు మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో హవాయి నుంచి జపాన్ వరకు పలు దేశాలు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
కమ్చట్కా ద్వీపకల్పంలో వరుస భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వందల సంవత్సరాల తర్వాత క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం బద్దలు కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వరుస విపత్తులు కమ్చట్కాను కుదిపేస్తోంది. క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం ఇటీవల ఆకాశంలోకి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిదను వెదజల్లింది. దట్టమైన బూడిద మేఘాలు అగ్నిపర్వతంపై నుంచి ఆకాశంలోకి ఎగసిపడుతున్న దృశ్యాలను రాష్ట్ర మీడియా సైతం విడుదల చేసింది.