Man’s Promise To His Blind Wife Is Captivating Millions: ప్రేమంటే కేవలం సంతోషాన్ని పంచుకోవడమే కాదు, కష్టాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలవడం. ఆ బంధానికి, ఆ మాటకు నిలువుటద్దంలా నిలుస్తున్నాడు చైనాకు చెందిన లీ జుక్సిన్. కంటిచూపు కోల్పోయిన తన భార్యకు 12 ఏళ్లుగా కన్నులై నిలిచి, ఆమె జీవితంలో వెలుగులు నింపుతున్నాడు. నేడు ఇతని ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది.
చైనాలోని కింగ్‌డావో నగరానికి చెందిన 39 ఏళ్ల లీ జుక్సిన్‌కు, జాంగ్ జియింగ్‌తో 2008లో వివాహమైంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ కుమార్తె కూడా జన్మించింది. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో 2013లో విధి పెను సవాలు విసిరింది. జాంగ్ కంటికి తీవ్రమైన వ్యాధి సోకింది. దాదాపు 5 లక్షల యువాన్లు (సుమారు 58 లక్షల రూపాయలు) ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. 2014 మధ్య నాటికి ఆమె పూర్తిగా అంధురాలిగా మారింది. ఆ క్షణంలో తమ జీవితం “స్వర్గం నుంచి నరకంలోకి పడిపోయినట్టు” అనిపించిందని లీ ఆవేదనతో గుర్తుచేసుకున్నారు.
అయితే, లీ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. కుంగిపోతున్న తన భార్యకు ధైర్యం చెప్పాడు. “నీ జీవితాంతం నీకు తోడుగా ఉంటాను, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను” అని మాట ఇచ్చాడు. కేవలం మాటలతో సరిపెట్టలేదు, చేతల్లో చూపించాడు. ఆమెకు అలవాటైన ప్రపంచం చెదిరిపోకూడదని, ఇంట్లో గానీ, తను పనిచేసే కార్ రిపేర్ షాపులో గానీ ఏ ఒక్క వస్తువును కూడా తన స్థానం నుంచి మార్చలేదు. దీనివల్ల జాంగ్ తన జ్ఞాపకశక్తితోనే సులభంగా నడవగలిగింది, పనులు చేసుకోగలిగింది. భర్త ప్రోత్సాహంతో క్రమంగా ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని, రోజువారీ పనులతో పాటు వంట చేయడం కూడా తిరిగి ప్రారంభించింది.
View this post on Instagram
వారి కుటుంబ పరిస్థితి మెరుగుపడ్డాక, సమాజానికి తిరిగి సేవ చేయాలనే ఉద్దేశంతో, 2020లో లీ తన భార్య పూర్తి మద్దతుతో ఒక స్వచ్ఛంద రెస్క్యూ టీమ్‌లో చేరాడు. వీరి స్ఫూర్తిదాయక గాథ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ప్రేమకు అసలైన అర్థం మీరే, మీకు వందనం,” అని ఒకరు వ్యాఖ్యానించగా, “ప్రేమ అన్ని కష్టాలను జయిస్తుందని మీ కథ చూశాక మరోసారి నమ్మకం కలిగింది,” అని మరొకరు కామెంట్ చేశారు. ఈ జంట కథ నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.
ALSO READ: Canada: కార్మిక విధానాల్లో మార్పులు.. ఇకపై కెనడా వెళ్లి పనిచేయాలంటే కష్టమే


