Earthquake in Alaska: అమెరికాలోని అలాస్కా తీర ప్రాంతాన్ని బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైనట్టు అమెరికా భూగర్భ విభాగం (USGS) ప్రకటించింది. ఈ ప్రకంపనలతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 12:37 సమయంలో భూకంపం సంభవించిందని తెలుస్తోంది. దీని కేంద్ర బిందువు, సాండ్ పాయింట్ పట్టణానికి దక్షిణంగా సుమారు 87 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు తెలిపారు. భూకంపం భూమికి 20.1 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకున్నదని యూఎస్‌జీఎస్ వెల్లడించింది.
ఈ ప్రకంపనల అనంతరం దక్షిణ అలాస్కాతో పాటు అలాస్కా ద్వీపకల్ప ప్రాంతాల్లో సునామీకి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం, అలాస్కాలోని కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు దక్షిణంగా 40 మైళ్లు) నుంచి యూనిమాక్ పాస్ (ఉనలస్కాకు వాయువ్యంగా 80 మైళ్లు) వరకూ పసిఫిక్ తీర ప్రాంతాల్లో ఈ హెచ్చరికలు అమలులో ఉన్నాయి.
గతంలో 1964 మార్చిలో అలాస్కా రాష్ట్రంలో 9.2 తీవ్రతతో వచ్చిన ఘోర భూకంపాన్ని గుర్తు చేస్తోంది ఈ ఘటన. అది ఉత్తర అమెరికాలో నమోదైన అతి భారీ భూకంపంగా నిలిచింది. ఆ భూకంపంతో పాటు వచ్చిన సునామీ పలు ప్రాంతాల్లో విలయం సృష్టించింది. ఆ ఘటనలో 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.


