Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Melania Trump : ''ఆ పిల్లల ముఖాలు చూసి యుద్ధం ఆపండి"... పుతిన్‌కు మెలానియా...

Melania Trump : ”ఆ పిల్లల ముఖాలు చూసి యుద్ధం ఆపండి”… పుతిన్‌కు మెలానియా ట్రంప్ హృద్యమైన లేఖ!

Melania Trump’s peace letter to Putin : ప్రపంచమంతా ఉత్కంఠగా చూస్తున్న వేళ, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రాసిన ఓ లేఖ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతున్న నేపథ్యంలో, “ఆ పిల్లల ముఖాలు చూసి యుద్ధం ముగించండి” అంటూ ఆమె చేసిన హృద్యమైన విన్నపం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. అలాస్కాలో భర్త డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌తో జరిపిన కీలక భేటీలో ఈ లేఖను స్వయంగా అందజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ ఆ లేఖలో ఏముంది..? ప్రథమ మహిళ అభ్యర్థనకు పుతిన్ స్పందన ఏంటి..? ఈ పరిణామం యుద్ధ గతిని మారుస్తుందా…?

గత మూడేళ్లుగా యూరప్‌ను అతలాకుతలం చేస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మధ్య అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెన్‌డార్ఫ్-రిచర్డ్‌సన్‌లో అత్యంత కీలక సమావేశం జరిగింది. ఈ శిఖరాగ్ర చర్చల సందర్భంగా, ట్రంప్ తన సతీమణి మెలానియా రాసిన ఒక ప్రత్యేక లేఖను పుతిన్‌కు చేరవేశారు.యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోతున్న చిన్నారుల దుస్థితిని ప్రస్తావిస్తూ మెలానియా ఈ లేఖను రాశారు.

- Advertisement -

హృదయాలను ద్రవింపజేస్తున్న లేఖ : మెలానియా తన లేఖలో ఎక్కడా నేరుగా ఉక్రెయిన్ పేరును ప్రస్తావించనప్పటికీ, ఆమె మాటల్లోని ఆవేదన స్పష్టంగా కనిపించింది. “భౌగోళిక సరిహద్దులు, ప్రభుత్వాలు, భావజాలాలకు అతీతంగా నిలిచేది పిల్లల అమాయకత్వం. ప్రతి చిన్నారి హృదయంలో ఒకే రకమైన కలలు ఉంటాయి… ప్రేమ, భద్రత, ఆనందమయ భవిష్యత్తు కోసం వారు కలలు కంటారు,” అని ఆమె పేర్కొన్నారు. యుద్ధం కారణంగా తమ నవ్వును, బాల్యాన్ని కోల్పోయిన చిన్నారుల గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మిస్టర్ పుతిన్, మీరు ఒక్కరే వారి మధురమైన నవ్వులను తిరిగి తీసుకురాగలరు. ఈ చిన్నారుల అమాయకత్వాన్ని కాపాడటం ద్వారా మీరు కేవలం రష్యాకు మాత్రమే కాదు, యావత్ మానవాళికే సేవ చేసినవారవుతారు,” అంటూ పుతిన్‌ను ఆమె అభ్యర్థించారు.
ఈ లేఖ వార్తను మొదట ‘ఫాక్స్ న్యూస్’ ప్రచురించగా, ఆ తర్వాత అటార్నీ జనరల్ పామ్ బోండి సహా ట్రంప్ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

యుద్ధ నేరాల ఆరోపణల నడుమ : 2022 ఫిబ్రవరిలో మాస్కో దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది ఉక్రెయిన్ చిన్నారులను రష్యా బలవంతంగా తరలించిందని, వారిని రష్యన్లుగా మార్చే ప్రయత్నం చేస్తోందని కీవ్ ఆరోపిస్తోంది. దీనిని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) యుద్ధ నేరంగా పరిగణించి పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. అయితే, యుద్ధ క్షేత్రంలోని దుర్భర పరిస్థితుల నుంచి పిల్లలను కాపాడుతున్నామని రష్యా వాదిస్తోంది. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో మెలానియా లేఖకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ఫలించని ట్రంప్-పుతిన్ భేటీ : అయితే, సుమారు మూడు గంటల పాటు సాగిన ట్రంప్-పుతిన్ చర్చల్లో యుద్ధ విరమణకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు. చర్చలు ఫలప్రదంగా, సానుకూల వాతావరణంలో జరిగాయని ఇరువురు నేతలు ప్రకటించినప్పటికీ, శాంతి దిశగా తక్షణ పురోగతి కనిపించలేదు. అయినప్పటికీ, ఈ చర్చల ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తాను వాషింగ్టన్‌లో సమావేశమవుతానని, ఒప్పందం దిశగా ఆయన్ను ప్రోత్సహిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.  ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే, సోమవారం వాషింగ్టన్‌లో ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ ఖరారైనట్లు వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad