Modi Urges SCO Fight Against Terrorsim: చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సమావేశంలో వివిధ దేశాధినేతలతో వాణిజ్యం, ఇంధనం, రక్షణ, పరస్పర సహకారం వంటి అనేక కీలక అంశాలపై చర్చించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తియాన్‌జిన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి శెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. అయితే ఆయన్ను మోదీ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. ఇతర సభ్య దేశాల సభ్యులతో మోదీ ముచ్చటిస్తుండగా షరీఫ్ చేతులు ముడుచుకొని చూస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ “టియాంజిన్‌లో సమావేశం కొననసాగుతోంది. మా అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం” అని మోడీ వెల్లడించారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/modi-xi-jinping-sco-meeting-2025/
కాగా ఈ సందర్భంగా ‘ఉగ్రవాదంపై మనమంతా ఒకే గొంతుకగా ఉండాల్సిన అవసరం ఉంది. ద్వంద్వ ప్రమాణాలు (రెండు నాల్కల ధోరణి) ఆమోదయోగ్యం కావు. అని అన్ని దేశాలు ఏకగ్రీవంగా చెప్పాల్సి ఉంటుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే. ఇది మనందరి బాధ్యత’ అని మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని శెహబాజ్ షరీఫ్ ఈ సదస్సులో పాల్గొనడం గమనార్హం.
మోదీ ప్రసంగానికీ సభ్యదేశాలు సంఘీభావం ప్రకటించాయి. ఉగ్రవాదాన్నిఖండించాల్సిందేనని సభ్యులు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు సంఘీభావం ప్రకటించాయి. ఉగ్రవాదానికి పాల్పడేవారు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారు, ప్రోత్సహించేవారు.. అంతా ఒక్కటేనని..అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. అలాంటివారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత దేశాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సమావేశంలో పాకిస్తాన్ పేరు చెప్పకుండానే పరోక్షంగా దాయాదిని టార్గెట్‌గా చేసుకున్నారు.
‘40 ఏళ్లుగా భారత్ క్రూరమైన ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. చాలా మంది తల్లులు పిల్లలను కోల్పోయారు. పిల్లలు అనాథలయ్యారు. ఇటీవల పహల్గాంలో చాలా అసహ్యకరమైన ఉగ్రవాదాన్ని చూశాం. ఆ బాధాకర సమయంలో మాకు అండగా నిలిచిన మిత్ర దేశాలకు కృతజ్ఞతలు’ అని మోదీ చెప్పారు.
‘ఈ దాడి భారతదేశ ఆత్మకు దెబ్బ మాత్రమే కాదు, ప్రతి దేశానికి, మానవత్వాన్ని నమ్మే ప్రతి వ్యక్తికి ఓ సవాలుగా నిలిచిందని గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని టూరిస్ట్ ప్లేజ్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.


