Ukraine President Zelensky: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని ప్రాంతాలపై పట్టుసాధించేందుకు రష్యా చేస్తున్న దాడులను ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ తిప్పికొడుతూనే ఉంది. ఇరుదేశాల మధ్య యుద్ధానికి పది నెలలు అవుతుంది. ఈ పదినెలల కాలంలో వేలాది మంది ఇరు దేశాల సైనికులు, ఉక్రెయిన్ ప్రజలు మరణించారు. రష్యా మిసైళ్ల దాడులతో విరుచుకుపడుతుండటంతో బతుకుజీవుడా అనుకుంటూ శిథిలాల కింద ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల ప్రజలు తలదాచుకుంటున్నారు.
ఉక్రెయిన్‌కు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు మద్దతుగా నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తో పాటు అధికశాతం దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఉక్రెయిన్ పై దాడులు ఆపాలని పలుసార్లు హెచ్చరికలు చేసిన రష్యా వెనక్కు తగ్గకపోవటంతో అన్ని అంశాలపై ఆ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం కఠినమైన ఆంక్షలనుసైతం లెక్కచేయకుండా ఉక్రెయిన్ ను తమ హస్తగతం చేసుకొనేందుకు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఆదేశించారు. దీంతో రష్యా దాడులు ప్రారంభమై పది నెలలు అవుతున్న సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ మాట్లాడారు.. భావోద్వేగ ప్రసంగం చేశారు. స్వేచ్ఛ కావాలంటే మనం మరింత త్యాగాలకు సిద్ధం కావాలని ఉక్రెయిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కనికరం లేని దాడులు జరుపుతూ రష్యా లక్షలాది పౌరులను అంధకారంలోకి నెడుతోంది. అయినప్పటికీ, తాము తలవంబోమని అన్నారు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఉక్రెయిన్లు తమదైన అద్భుతాన్ని సృష్టిస్తారని తన క్రిస్మస్ సందేశం ఇచ్చారు. మేం ఇప్పటి వరకు యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాం. దాడులు, బెదిరింపులు, అణు బ్లాక్ మెయిల్, ఉగ్రవాదం, క్షిపణి దాడులనూ తట్టుకున్నాం. ఈ కఠిన శీతాకాలాన్ని కూడా భరిస్తాం. ఎందుకంటే, దేనికోసం పోరాడుతున్నామో మాకు తెలుసు జెలెన్‌స్కీ అన్నారు. స్వేచ్ఛ కోసం చాలా త్యాగం చేయాల్సిన ఉంటుందని, అందుకు ఉక్రెయిన్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు.