More Than 145 People Died Due To Heavy Rains Thailand Is Affected: థాయ్‌లాండ్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ థాయ్‌లాండ్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా ప్రాణనష్టంతో పాటు ఆస్థి నష్టం సంభవించింది. ఈ భారీ వరద బీభత్సంలో చిక్కుకొని మరణించిన వారి సంఖ్య 145కి చేరినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం, కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 12 దక్షిణ ప్రావిన్సుల్లోని 12 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 36 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు విపత్తు నివారణ శాఖ తెలిపింది. వరధ బీభత్సంపై ప్రభుత్వ అధికార ప్రతినిధి సిరిపాంగ్ అంగ్‌కాసాకుల్కియాట్ మాట్లాడుతూ.. వరద బీభత్సం కారణంగా మొత్తం ఎనిమిది ప్రావిన్సుల్లో 145 మంది మరణించగా, ఒక్క సోంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లోనే 110 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, ఆ ప్రాంతంలోని అతిపెద్ద నగరమైన హ్యాట్ యాయ్‌లో వరద బీభత్సం తగ్గాక, శిథిలాల కింద చిక్కుకున్న మరిన్ని మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ సోంగ్‌ఖ్లాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇది మునుపెన్నడూ చూడని విపత్తుగా ఆయన అభివర్ణించారు. స్థానిక ఆసుపత్రులపై భారం తగ్గించడానికి హ్యాట్ యాయ్ హాస్పిటల్ కోసం ప్రత్యేకంగా ఎనిమిది ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీగా వైద్యం అవసరమైన 20 మంది రోగులను గురువారం హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హ్యాట్ యాయ్ జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పునరావాస కేంద్రాలకు 16,000 మందికి పైగా ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు.
ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు..
గత వారం కేవలం మూడు రోజుల్లోనే హ్యాట్ యాయ్, దాని పరిసర ప్రాంతాల్లో 630 మిల్లీమీటర్ల (25 అంగుళాలు) రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకూలడం, వాహనాలు కొట్టుకుపోవడం, చెట్లు కూలిపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించాయి. ఒకప్పుడు మార్కెట్లు, స్ట్రీట్ ఫుడ్‌తో పర్యాటకులను ఆకర్షించే హ్యాట్ యాయ్ నగరం ఇప్పుడు బీభత్సమైన వరదలతో పూర్తిగా బురదమయంగా మారింది. ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో పేరుకుపోయిన బురదను, శిథిలాలను తొలగించేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వరద ధాటికి మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

