వాషింగ్టన్(తెలుగు ప్రభ): అమెరికా మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో ప్రచార ఖర్చు భారీగా పెరిగింది. పార్టీలకు మద్దతుగా సంపన్నులు, బిలియనీర్లు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యంగా రిపబ్లికన్లకు మద్దతుగా ఎలాన్ మస్క్, డెమోక్రాట్లకు అండగా జార్జి సోరస్ భారీ మొత్తాలను వెచ్చించారు. ‘ఓపెన్ సీక్రెట్స్’ అనే ఎన్నికల నిధుల పరిశీలన సంస్థ గణాంకాల ప్రకారం.. 2026 మధ్యంతర ఎన్నికల కోసం మొత్తం 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.13 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు అంచనా. 2022 మధ్యంతర ఎన్నికలతో పోలిస్తే ఈ వ్యయం 30 శాతం పెరిగింది. అక్టోబర్ మధ్య నాటికే అభ్యర్థులు 9.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. గత మధ్యంతర ఎన్నికల్లో అధికార పక్షం కాంగ్రెస్‌లో తన స్థానాలను పెంచుకున్న సందర్భాలు 1934, 2002లో మాత్రమే ఉన్నాయన్న గణాంకాలు ఈసారి రిపబ్లికన్లపై రాజకీయ ఒత్తిడిని సూచిస్తున్నాయి.
రిపబ్లికన్లకు మస్క్ భారీ విరాళం..
స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగతంగా రిపబ్లికన్ పార్టీకి అత్యధిక విరాళాలు అందించిన వ్యక్తిగా నిలిచారు. ఆయన సుమారు 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4 వేల కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఇందులో అధిక భాగం ‘అమెరికా పీఏసీ’ అనే పొలిటికల్ యాక్షన్ కమిటీకి వెళ్లినట్లు సమాచారం. టెక్సాస్‌లో రిపబ్లికన్ సెనెట్ అభ్యర్థి కెన్ పాక్స్‌టన్‌కు అత్యధికంగా నిధులు అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో బిలియనీర్ జెఫ్ యాస్ కూడా 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.
డెమోక్రాట్లకు జార్జి సోరస్ అండ..
మరోవైపు, బిలియనీర్ జార్జి సోరస్‌కు చెందిన సంస్థలు డెమోక్రటిక్ పార్టీకి మొత్తం 102 మిలియన్ డాలర్లు (సుమారు రూ.965 కోట్లు) సమకూర్చాయి. న్యూయార్క్ మాజీ మేయర్, బ్లూమ్‌బెర్గ్ ఎల్‌పీ వ్యవస్థాపకుడు మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ కూడా డెమోక్రాట్లకు 60 మిలియన్ డాలర్లు అందించారు. రెండు పార్టీలూ విరాళాల్లో అధిక భాగాన్ని సూపర్ పీఏసీల ద్వారా ప్రచార కార్యక్రమాలు, ప్రకటనలు, ఇతర రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ గణాంకాల ప్రకారం.. అక్టోబర్ మధ్య నాటికి సూపర్ పీఏసీలు మాత్రమే 5.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి.
సంపన్నుల నుంచే భారీగా నిధులు..
2026 ఎన్నికల్లో సంపన్నులు, పెద్ద ఆర్థిక సంస్థలు రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు అందిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రిప్టోకరెన్సీ రంగానికి చెందిన కంపెనీలు కూడా తమ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలకు 60 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సమకూర్చాయి. ‘బెన్నన్ సెంటర్ ఫర్ జస్టిస్’ అంచనాల ప్రకారం.. 40 మంది సంపన్నులు కలిపి పార్టీలకు 2.4 బిలియన్ డాలర్లు అందించారు. మరోవైపు, ప్రకటనలు, డిజిటల్ ప్రచారం కోసం రాజకీయ పార్టీలు 11.15 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు ‘యాడ్ ఇంపాక్ట్’ సంస్థ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో డబ్బు ప్రభావం ఎంతగా పెరిగిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలకు మద్దతుగా బిలియనీర్లు, కార్పొరేట్ సంస్థలు భారీగా నిధులు సమకూరుస్తుండటంతో అమెరికా ఎన్నికల నిధుల వ్యవస్థ, రాజకీయ నిర్ణయాలపై సంపన్నుల ప్రభావం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

