మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం కన్నీరు పెట్టించే విధంగా మారింది. నెపిడాలోని ఆసుపత్రుల ముందు గాయపడిన వారు చికిత్స కోసం వేచిచూస్తూ ఉన్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. రక్తసిక్తంగా పడిపోయిన బాధితులను వారి కుటుంబసభ్యులు ఓదార్చుతుండగా, సహాయక సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ టీమ్‌లు గాలింపు చర్యలు చేపట్టాయి.
మయన్మార్, థాయిలాండ్‌లలో భూకంపం కారణంగా మృతుల సంఖ్య 1,000 దాటింది. మయన్మార్‌లో 694 మంది మరణించారని ఆ దేశ మిలిటరీ అధికారులు తెలిపారు. రెండు దేశాల్లో కలిపి 2,370 మంది గాయపడ్డారు. అయితే, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అమెరికా సర్వే ఏజెన్సీ చెబుతోంది. ఇక భూకంప బీభత్సంతో అనేక ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కూలిన భవన శిథిలాల నుంచి జనాలను బయటకు తీసేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి. అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రుల వెలుపల తాత్కాలిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌లో మరోసారి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున 4.2 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఇక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపం కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ భారీ భవనం కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.