Myanmar conflict : మయన్మార్ గడ్డపై నెత్తురుటి అడుగులు మళ్లీ పడ్డాయి. పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఆ దేశంలో మరోసారి మానవతా సంక్షోభం తలెత్తింది. సెంట్రల్ సాగింగ్ ప్రాంతంలోని ఓ బౌద్ధ ఆశ్రమంపై మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఏకంగా 23 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దేశంలో శాంతి, స్థిరత్వం కరువైన వేళ, పౌరులపై సైన్యం దాడులు చేయాల్సిన అవసరం ఏంటి? ఈ దాడుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఈ ఘోర ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
జెట్ ఫైటర్ బాంబు దాడి : 2025లో మయన్మార్ అంతర్యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ, సాగింగ్ టౌన్‌షిప్‌లోని లిన్ టా లు గ్రామంలోని ఒక ఆశ్రమ భవనంపై తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జెట్ ఫైటర్ బాంబు దాడి చేసింది. ఈ ఆశ్రమం దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన మండలేకు వాయువ్యంగా కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడిలో మరణించిన వారంతా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులే కావడం విషాదకరం. ప్రాణభయంతో తమ గ్రామాలను వదిలివచ్చిన 150 మందికి పైగా ప్రజలకు ఈ ఆశ్రమం ఒక సురక్షిత ప్రదేశంగా నిలిచింది. కానీ, దురదృష్టవశాత్తు, అదే వారి పాలిట మృత్యుకూపంగా మారింది. అయితే, ఈ ఆశ్రమంపై జరిగిన దాడిపై సైన్యం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
మయన్మార్ అంతర్యుద్ధం: 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని కూలదోసి, సైన్యం అధికార పగ్గాలు చేపట్టడం మయన్మార్ అంతర్యుద్ధానికి నాంది పలికింది. నాటి నుంచి ఆ దేశం రాజకీయ కల్లోలాలతో అల్లకల్లోలంగా మారింది. సైనిక పాలనను వ్యతిరేకించే ప్రజలు మొదట శాంతియుత ప్రదర్శనలు నిర్వహించగా, వాటిని సైన్యం అణచివేసింది. దీంతో ప్రజలు ఆయుధాలను చేతబట్టి ప్రతిఘటనకు దిగారు. ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఘర్షణలు నెలకొన్నాయి. ముఖ్యంగా అల్పసంఖ్యాకులు నివసించే సరిహద్దు ప్రాంతాలు రావణకాష్టంలా రగులుతున్నాయి. సాగింగ్ ప్రాంతం ఈ సాయుధ ప్రతిఘటనకు బలమైన కోటగా మారింది. ఈ ప్రాంతంలో సాయుధ దళాలను ఎదుర్కోవడానికి సైన్యం వైమానిక దాడులను ఎక్కువగా ఉపయోగించింది. తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ దాడులు మరింత తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది.
తిరుగుబాటు గ్రూపులు: ఒక విహంగ వీక్షణం :మయన్మార్‌లో ఎంఎన్‌డీఏఏ (MNDAA), అరకాన్ ఆర్మీ (Arakan Army – AA), టీఎన్‌ఎల్‌ఏ (TNLA) గ్రూపులు 2023 చివరి నుంచి సైనిక ప్రభుత్వంపై సమన్వయంతో పోరాడుతున్నాయి. వీటిని ‘త్రీ బ్రదర్‌హుడ్ అలయన్స్’ (Three Brotherhood Alliance) అని పిలుస్తుంటారు.
అరకాన్ ఆర్మీ (AA): బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న రఖైన్ ప్రాంతంలో మయన్మార్ సైన్యాన్ని ఎదుర్కొంటోంది.
చిన్ బ్రదర్‌హుడ్ అలయన్స్ (CBA): చిన్ ప్రాంతంలో పోరాడుతున్న సీబీఏకి అరకాన్ ఆర్మీ మద్దతు ఇస్తోంది.
టీఎన్‌ఎల్‌ఏ (TNLA) ఎంఎన్‌డీఏఏ (MNDAA): చైనా సరిహద్దులోని షాన్ ప్రాంతంలో ఈ రెండు గ్రూపులు పోరాడుతున్నాయి.
ప్రస్తుత నియంత్రణ ప్రాంతాలు: రఖైన్ ప్రాంతం: భారత్-బంగ్లా సరిహద్దులోని రఖైన్ ప్రాంతమంతా ఇప్పుడు అరకాన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది.
చిన్ ప్రాంతం: చిన్‌లో 85 శాతం ప్రాంతాన్ని సీబీఏ తమ అదుపులోకి తీసుకుంది.
ఈ పరిణామాలు మయన్మార్‌లో భవిష్యత్తు రాజకీయ, సామాజిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పౌరుల ప్రాణాలకు రక్షణ కరువైన వేళ, అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


