Navya Nair Australia trip: ఆస్ట్రేలియాకు వెళ్తున్నారా?.. మల్లెపూలే కాదు వీటికీ నో ఎంట్రీ.. ఓసారి చెక్ చేసుకోండి
మల్లెపూలు ధరించి విమానంలో ప్రయాణించిన మలయాళ నటి నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ విమానాశ్రయంలో ఛేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఆమెకు రూ.1.14 లక్షల జరిమానా విధించడం చర్చనీయాంశమైంది. అయితే అక్కడ పాటించే కఠినమైన నిబంధనల మేరకు కేవలం మల్లెపూలు మాత్రమే కాదు.. మనం వినియోగించే అనేక వస్తువులు, పదార్థాలపై ఆస్ట్రేలియాలో నిషేధం ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని తీసుకువెళ్లిన వారికి జరిమానాతో పాటు ఒక్కోసారి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అక్కడి నిబంధనలను బట్టి తెలుస్తోంది. అవేంటో చూద్దాం.
తీసుకెళ్లకూడని వస్తువులు ఇవే..
తాజా లేదా ఎండిన పువ్వులు, పండ్లు, కూరగాయలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ముడి గింజలు, విత్తనాలు, పాల ఉత్పత్తులు, బర్ఫీ, రసమలై, రసగుల్లా, దూద్‌పేడ, గులాబ్ జామున్, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, బియ్యం, టీ, తేనె, ఇంట్లో తయారుచేసిన ఆహారం, పెంపుడు జంతువుల ఆహారం, పక్షులు, జంతువుల ఈకలు, ఎముకలు, చర్మంతో చేసిన జాకెట్లు, బ్యాగులు, దుప్పట్లు, మూలికలు తదితర పదార్థాలు.
నిబంధనలు అతిక్రమిస్తే..?
తమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఆస్ట్రేలియా (Australia) అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. విదేశీ ప్రయాణికులు నిషేధిత వస్తువులను తీసుకువస్తే.. వాటిని స్వాధీనం చేసుకున్న వెంటనే ధ్వంసం చేస్తారు. అనంతరం ఆ ప్రయాణికులకు జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ అవి తీవ్రమైన ఉల్లంఘనలైతే ప్రయాణికుల వీసాలను సైతం రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాకు వెళ్లేవారు మీరు తీసుకువెళ్తున్న ఆహార పదార్థాలు, వస్తువులకు సంబంధించిన వివరాలను ముందుగానే అక్కడి అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ అవి నిషేధిత జాబితాలో ఉంటే విమానాశ్రయం అధికారులు వాటిని జప్తు చేస్తారు. ఎటువంటి జరిమానా విధించరు. అలా కాకుండా ఇమిగ్రేషన్ అధికారుల కళ్లు గప్పి దొంగచాటుగా లేదంటే తెలియకుండా నిషేధిత వస్తువులను తీసుకెళ్తే మాత్రం తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదు.
నిషేధం ఎందుకంటే?
కొన్నిరకాల ఆహార పదార్థాలు, వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుండడం, ప్రజలకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటువంటి కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రపంచంలోని అత్యంత కఠినమైన చట్టాలు అమల్లో ఉన్న విమానాశ్రయాల్లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టు ఒకటి. మళయాళ నటి నవ్య మెల్‌బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్‌లో మల్లెపూల (Jasmine)ను తీసుకువచ్చినందుకు జరిమానా విధించడంతో నటి లక్ష రూపాయలు చెల్లించింది.


