Nepal Crisis: నేపాల్ రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటు విషయమై సైన్యంతో చర్చలు జరిపేందుకు తమ ప్రతినిధిగా దేశ తొలి మహిళా మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజే) సుశీలా కర్కీని ఎంచుకుంటున్నట్లు ‘జెన్ జీ’ నిరసనకారులు ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన యువత, ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన ఈ నిరసనలు, అనతికాలంలోనే వ్యవస్థీకృత అవినీతికి వ్యతిరేకంగా భారీ ఉద్యమంగా మారాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ప్రధాని కేపీ ఓలీ మంగళవారం రాజీనామా చేయగా, దేశం రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటు కోసం సైన్యంతో చర్చలు జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ALSO READ: India on Nepal Protests: నేపాల్‌లో భగ్గుమన్న అశాంతిపై భారత్ ఆందోళన.. పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచన
యువత డిమాండ్లు ఇవే:
ప్రజల మరణాలకు కారణమైన నాటి ప్రధాని, హోంమంత్రితో సహా అధికారులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. ఏ వ్యక్తి రెండుసార్లకు మించి ప్రధాని కాలేని విధంగా కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలి. రాజ్యాంగబద్ధ సంస్థలలో రాజకీయ నియామకాలను రద్దు చేసి, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలి.
ఎవరీ సుశీలా కర్కీ?
సుశీలా కర్కీ అవినీతి పట్ల జీరో టాలరెన్స్ వైఖరి కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. ఆమె సీజేగా ఉన్నప్పుడు ఎన్నో కీలకమైన అవినీతి కేసులను విచారించారు. అధికారంలో ఉన్న మంత్రులను, అవినీతి నిరోధక కమిషన్ చీఫ్‌ను సైతం దోషులుగా తేల్చి సంచలన తీర్పులిచ్చారు. “ఈ పాతకాలం నాయకులకు విజన్ లేదు. వాళ్లు మన పిల్లల్ని చంపారు. అందుకే నేను ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాను,” అని ఇటీవలే ఆమె ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆమె నిష్పక్షపాత వైఖరి, ధైర్యమే ఇప్పుడు యువత ఆమె వైపు చూసేలా చేశాయి.
ALSO READ: Nepal: ఒక్క చిన్నారి.. కూలిన ప్రభుత్వం.. నేపాల్‌ను కుదిపేసిన ఘటన వెనుక అసలు కథ!


