Nepal Gen Z Protest Updates: నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు పూర్తి హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రభుత్వం విధించిన నిషేదాన్ని ఎత్తివేయాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళన నేపథ్యంలో నేపాల్ రాజధాని ఖాట్మండు వీధులు రణరంగంగా మారాయి. అయితే, ఆందోళనలకు తలొగ్గి ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం ఎత్తివేసినప్పటికీ… ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయిందని ఆరోపిస్తూ ప్రజలు తమ నిరసన కొనసాగిస్తున్నారు. నిరసనకారులు ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ నివాసంపై దాడి చేశారు. సోషల్ మీడియాలో దాడికి సంబంధించిన దృష్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో రామ్ చంద్ర పౌడెల్ ప్రైవేట్ నివాసంలోని కొన్ని భాగాలు మంటల్లో చిక్కుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా అధ్యక్షుడు రామ్ చంద్ర పాల్ ఇంట్లోని విలువైన వస్తువులను సైతం నిరసనకారులు దోచుకెల్లారు. మరోవైపు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి సంబంధించిన భక్తపూర్‌లోని ప్రైవేట్ నివాసంపై కూడా నిరసనకారులు దాడి చేసి, నిప్పంటించారు. నివాసం మంటల్లో కాలిపోవడంతో నిరసనకారులు నృత్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక, ఖాట్మండ్‌లోని ఆ దేశ సుప్రీంకోర్టుకు
సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అలాగే మంత్రుల కార్యాలయాలు, పలు ప్రభుత్వ భవనాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు.
ఆర్థిక మంత్రిని వెంబడించిన ఆందోళనకారులు..
అంతటి ఆగకుండా, నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌ను ఆందోళనకారులు వెంబడించారు. ఆయనపై దాడి చేసిన దృశ్యాలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే, నేపాల్‌లో హింస తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. నేపాల్ ఆర్మీ చీఫ్ సూచన మేరకు కెపీ శర్మ ఓలి ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. తీవ్ర ఉద్రిక్తల నడుమ ఇప్పటికే పలువురు కేబినెట్ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే కేపీ శర్మ ఓలి ఆర్మీ చాపర్‌లో తన నివాసం నుండి బయలుదేరుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు, ఆయన దేశం విడిచి వెళ్లిపోతున్నారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆయన దుబాయ్ చేరుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై నేపాల్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, నేపాల్‌లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మంగా మారాయి. ఈ ఆందోళనల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. నిరసనకారులు పార్లమెంటు భవనంలోకి చొరబడ్డారని… దీంతో భద్రతా దళాలు నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించాయని పీటీఐ కథనం పేర్కొంది.


